Influenza : హైదరాబాద్ నగర వాసులను ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వణికిస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ ‘ఇన్ ఫ్లూయెంజా ఎ’ రకం వైరస్ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. నిలోఫర్ ఆసుపత్రితో పాటు పలు ప్రైవేట్ చిన్న పిల్లల ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారు ఎక్కువగా ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరిలో ఈ వైరస్ తీవ్రత పెరిగి ప్రాణాల మీదికి వస్తుండటంతో వైద్య నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఇది ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి..? ఏయే లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి..? ఇంతకు వైద్యులు ఏం చెబుతున్నారు…?
ఇన్‌ఫ్లుయెంజా వైరస్ బారిన పడిన వారిలో సడెన్ గా ఫీవర్, గొంతు నొప్పి, పొడిదగ్గు, హెడెక్, ఒళ్లు నొప్పులు, విపరీతమైన ఆలసట వంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. ఒకరి నుంచి మరొకరికి ఇది చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఎవరైనా తుమ్మినా లేదా దగ్గినా, వారి నుంచి గాలిలోకి విడుదలయ్యే తుంపరల ద్వారా ఈ వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇమ్మ్యూనుటి పవర్ తక్కువగా ఉండే చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అలాగే మధుమేహం, ఆస్తమా వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారు ఈ వైరస్ బారిన పడే అవకాశం అత్యధికంగా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సున్నితమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండి, తగిన ముందస్తు జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరం.
ఇన్‌ఫ్లుయెంజాలో సాధారణ జ్వరానికి, ప్రమాదకరమైన పరిస్థితికి మధ్య డిఫరెంట్ ను గుర్తించడం అత్యంత కీలకమని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. స్టార్టింగ్ లో ఇది సాదాసీదా ఫ్లూలాగే కనిపించినప్పటికీ, కొందరిలో మాత్రం ఇది చాలా స్పీడ్ గా ఊపిరితిత్తులకు పాకుతుంది. దీనివల్ల తీవ్రమైన న్యూమోనియా వచ్చి శ్వాసకోశ ఇబ్బందులకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి శరీరంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనించడం చాలా అవసరం. చిన్న లక్షణాలను కూడా తేలికగా తీసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సరైన సమయంలో స్పందించకపోతే ఆరోగ్య పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వ్యాధి తీవ్రత పెరిగినప్పుడు కొన్ని ప్రమాదకరమైన లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది రావడం, ఆయాసం పెరగడం, శ్వాస చాలా స్పీడ్ గా తీసుకోవడం వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి. అలాగే ఛాతీ భాగంలో తీవ్రమైన నొప్పి, బరువుగా గుండె పట్టేసినట్లు అనిపించడం, శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోయి పెదవులు, గోళ్లు, ముఖం నీలం రంగులోకి మారడం వంటివి గమనిస్తే అసలు నెగ్లెట్ చేయకూడదు. తలతిరగడం, స్పృహ కోల్పోవడం, అయోమయ పరిస్థితి ఆగకుండా వాంతులు అవుతుంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన సమయం ఇది. ఏ చిన్న లక్షణం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన టెస్టులు చేయించుకోవడం మంచిది.
