ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయించుకోవాలంటే పేదలు భరించలేని పరిస్థితి. డబ్బులు లేక చికిత్స చేయించలేక ఎంతోమంది తమ వాళ్ళని కోల్పోతున్నారు. చికిత్స చేయించే స్థోమత లేక చిన్నతనంలోనే పసిమొగ్గలు నేలరాలిపోతున్నాయి. క్యాన్సర్ రోగుల చికిత్స కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 15 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుందని మీకు తెలుసా?
క్యాన్సర్ సోకితే చికిత్స చేయించుకోవడం అంటే మామూలు విషయం కాదు. దీని చికిత్స ఎంతో ఖరీదైంది. డబ్బున్నవాళ్ళు తప్పితే క్యాన్సర్ చికిత్సను పేదవాళ్ళు భరించలేరు. అయితే క్యాన్సర్ సోకిన పేదలకు చికిత్స కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 15 లక్షల ఆర్థిక సాయాన్ని అందించే పథకాన్ని అమలు చేస్తోంది. పేద క్యాన్సర్ రోగులకు వైద్యానికి అయ్యే ఖర్చు దాదాపు రూ. 15 లక్షల వరకూ ప్రభుత్వమే భరిస్తోంది. అయితే దురదృష్టవశాత్తు ఈ పథకం గురించి సరైన ప్రచారం, ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల పేద క్యాన్సర్ రోగులు ఈ పథకాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. గత నాలుగేళ్లలో ఏపీ నుంచి 97 మంది రోగులు ఈ పథకాన్ని వినియోగించుకోగా.. తెలంగాణ నుంచి ఒక్కరు కూడా వినియోగించుకోలేకపోవడం దురదృష్టకరం.
ఈ పథకం పేరు ‘రాష్ట్రీయ ఆరోగ్య నిధి – హెల్త్ మినిస్టర్స్ క్యాన్సర్ పేషెంట్ ఫండ్’ పథకాన్ని అమలు చేస్తోంది. క్యాన్సర్ సోకిన పేదలకు చికిత్స కోసం ఆర్థిక సాయం అందించాలన్న ఉద్దేశంతో 2009లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఈ పథకం అమలు అవుతుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు క్యాన్సర్ చికిత్స కోసం ఆర్థిక సాయం అందజేయాలన్న ఉద్దేశంతో దేశంలో 27 ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలుత క్యాన్సర్ రోగి చికిత్స కోసం రూ. 2 లక్షల వరకూ ఆర్థిక సాయం చేస్తారు. అంతకంటే ఎక్కువ డబ్బు అవసరమైతే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు దరఖాస్తులను పంపిస్తారు. క్యాన్సర్ రోగి పరిస్థితిని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధ్యయనం చేసి.. అవసరాన్ని బట్టి గరిష్టంగా రూ. 15 లక్షల వరకూ ఆర్థిక సాయం చేస్తుంది. అయితే ఈ డబ్బును పూర్తిగా క్యాన్సర్ చికిత్స కోసమే ఖర్చు చేయాలి.
ప్రాంతీయ క్యాన్సర్ సెంటర్లలో ప్రతీ సెంటర్ లోనూ ఫండ్ ఏర్పాటు చేస్తారు. క్యాన్సర్ రోగుల చికిత్సకు ఇచ్చే రూ. 2 లక్షలను ఈ ఫండ్ నుంచే ఇస్తారు. అయితే రూ. 2 లక్షల కన్నా ఎక్కువ డబ్బు అవసరమైతే.. రోగి కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రీజనల్ క్యాన్సర్ సెంటర్ లో మెడికల్ ఆఫీసర్ సిఫారసుతో దరఖాస్తు చేసుకోవాలి. కేంద్రం దరఖాస్తును పరిశీలించి అవసరాన్ని బట్టి రూ.సి 15 లక్షల వరకూ ఆర్థిక సాయం చేస్తుంది. దరఖాస్తు చేసుకున్నాక ఒకే దఫాలో డబ్బు చెల్లిస్తారు.
డైరెక్టర్, ఎంఎన్జె ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, రెడ్ హిల్స్, హైదరాబాద్ 500004
టెలిఫోన్ నంబర్: 040-23318422/23318414/23397000
ఫ్యాక్స్ నంబర్: 040-23314063
ఈమెయిల్: info@mnjiorcc.org, director@mnjiorcc.org, dirmnjiorcc@yahoo.com
సెక్షన్ ఆఫీసర్, గ్రాంట్స్ సెక్షన్
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్
రూమ్ నం. 541, ఏ-వింగ్, నారీమన్ భవన్
న్యూఢిల్లీ-110011
మరి క్యాన్సర్ సోకితే చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఇవాళ ఎంతోమంది పేదలు ఉన్నారు. ఈ పథకం ఉందని కనీస అవగాహన కూడా లేక ఎంతోమంది చికిత్స చేయించుకోలేక ప్రాణాలను కోల్పోతున్నారు. మరి క్యాన్సర్ సోకితే రూ. 2 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకూ ఆర్థిక సాయం అందించే ప్రభుత్వ పథకం ఉందని అందరికీ తెలియజేస్తారు కదూ. మీరు షేర్ చేయడం ద్వారా ప్రతీ ఒక్కరిలోనూ అవగాహన పెరుగుతుంది. దురదృష్టవశాత్తు ఈ పథకం గురించి ప్రచారం లేదు. మీ వంతుగా ఈ పథకాన్ని ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళండి. క్యాన్సర్ సోకిన నిరుపేదలకు చికిత్స కోసం ఆర్థిక సాయం అందుతున్న విషయాన్ని తెలియజేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.