ఆశ్రమంలో సేవలు చేసుకునేందుకు వచ్చిన ఒక బాలికపై అక్కడి స్వామీజీ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కాళ్లకు గొలుసు కట్టి బంధించి చిత్రహింసలకు గురిచేశాడు.
పాపం.. ఆ బాలికకు చిన్న వయసులోనే తల్లిదండ్రులు దూరమయ్యారు. ఒంటరిగా మారిన ఆమెను బంధువులు చేరదీసి కొన్నాళ్లు చదివించారు. ఆ తర్వాత ఒక ఆశ్రమంలో సేవల కోసం పంపించారు. కానీ ఆ ఆశ్రమ నిర్వాహకుడు, స్వామీజీ ఆమెపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఒక ఏడాది నుంచి బాలికను తన గదిలోనే కాళ్లకు గొలుసు వేసి బంధించాడు. ఆమె ఎదురుతిరిగితే కొట్టేవాడు. ఆ బాలికకు ఆకలేస్తే రెండు చెంచాల అన్నాన్ని నీటితో కలిపి మాత్రమే పెట్టేవాడు. రెండు వారాలకు ఓసారి మాత్రమే స్నానానికి వెళ్లాల్సి వచ్చేది. ఈ దారుణమైన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో చోటుచేసుకుంది. రాజమహేంద్రవరానికి చెందిన ఒక బాలిక (15)కు చిన్నతనంలోనే పేరెంట్స్ చనిపోయారు. దీంతో ఆమెను బంధువులు ఐదో తరగతి దాకా చదివించి.. రెండేళ్ల కింద విశాఖలోని కొత్త వెంకోజీపాలెం దగ్గర ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో సేవల కోసం పంపించారు.
ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీ ఆ బాలికతో ఆవులకు మేత వేయించడం, పేడ తీయడం లాంటి పనులు చేయించేవాడు. అర్ధరాత్రి బాలికను తనతో పాటు రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఏడాది నుంచి బాలిక కాళ్లకు గొలుసు వేసి బంధించాడు. కనీసం కాలకృత్యాలకు కూడా అనుమతించేవాడు కాదు. ఇలా రెండేళ్లుగా బాలికను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ నెల 13వ తేదీన పనిమనిషి సాయంతో బాధితురాలు ఆశ్రమం నుంచి బయటపడింది. స్వామీజీ తనను చిత్రహింసలకు గురిచేసిన విషయాన్ని కంకిపాడు పోలీసులకు వివరించింది. దీంతో బాలికను విజయవాడలోని దిశ పోలీసు స్టేషన్‌కు పంపారు. పూర్ణానంద స్వామీజీపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత బాలికను వైద్య పరీక్షల కోసం విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, విశాఖ పోలీసులు స్వామీజీని అరెస్ట్ చేశారు.