ఉప్పల్ లో తండ్రీకొడుకుల హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్య కేసులో మొదటగా ఆస్తులే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ తండ్రీకొడుకుల హత్యలో స్థిరాస్తులు కారణంగా కాదని, క్షుద్ర పూజలే వీరి హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ సంచలన నిజాలు వెలుగులోకి రావడంతో ఈ కేసు మరింత చర్చకు దారి తీసింది. ఈ ఘటనలో అసలు ఏం జరిగింది? ఈ తండ్రీకొడుకుల హత్యకు కారణం ఏంటనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. హైదరాబాద్ ఉప్పల్ లోని హనుమసాయి నగర్ ప్రాంతం. ఇక్కడే నర్సింహ శర్మ (78) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి శ్రీనివాసు (45) అనే కుమారుడు కూడా ఉన్నాడు. నర్సింహ శర్మ స్థానికంగా క్షుద్ర, వాస్తు పూజలు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుండేవాడు.
ఈ నేపథ్యంలోనే నర్సింహ శర్మ కు వినాయక్ రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయంతోనే వినాయక్ రెడ్డి నర్సింహ శర్మతో క్షుద్ర పూజలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక కొన్ని రోజుల తర్వాత వినాయక్ రెడ్డి పూర్తిగా ఆర్థికంగా, శారీరకంగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ కారణంగానే వినాయక్ రెడ్డి నర్సింహ శర్మపై కోపం పెంచుకున్నాడు. ఇక ఎలాగైన నర్సింహ శర్మను హత్య చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇందు కోసం వినాయక్ రెడ్డి గట్టి ప్లాన్ తో ముందుకు వెళ్లాడు. ఈ ప్లాన్ లో భాగంగానే వినాయక్ రెడ్డి బాలకృష్ణారెడ్డి అనే స్నేహితుడి సాయం తీసుకున్నాడు. అయితే వినాయక్ రెడ్డి వారం ముందుగానే నర్సింహ శర్మ ఇంటి ముందు ఉన్న ఓ హాస్టల్ లోకి దిగాడు.
వినాయక్ రెడ్డి గత రెండు మూడు రోజుల నుంచి నర్సింహ శర్మ కదలికలను గమనించి రెక్కీ నిర్వహించాడు. దీంతో పక్కా ప్లాన్ తో వెళ్లిన వినాయక్ రెడ్డి.. శుక్రవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో కత్తులతో నర్సింహ శర్మ ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం నిద్రిపోతున్న నర్సింహ శర్మను వినాయక్ రెడ్డి అతని స్నేహితుడు అతి కిరాతకంగా పొడిచి పరుగులు తీసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలోనే నర్సింహ శర్మ కుమారుడు శ్రీనివాసు అడ్డు వచ్చాడు. ఇక ఈ దుండగులు అడ్డొచ్చిన శ్రీనివాసును సైతం దారుణంగా హత్య చేశారు. ఈ హత్య అనంతరం దుండగులిద్దరూ వెంటనే విశాఖకు వెళ్లిపోయారు. ఇక ఉదయం 6 గంటలకు తండ్రీకొడుకులు రక్తపు మడుగులో పడి ఉండడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
తండ్రీకొడుకులను హత్య చేయడంతో సంచనలంగా మారిది. ఈ విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోస్ట్ మార్టంకు తరలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. మొదటగా ఆస్తుల నేపథ్యంలోనే హత్య జరిగినట్లుగా అనుమానించారు. ఇక నిందితుల సెల్ ఫోన్ ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు నిందితులు వినాయక్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం క్షుద్ర, వాస్తు పూజల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా తేలింది. ఇక ఇదే కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నామని పోలీసులు తెలిపారు. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.