నేటికాలంలో చాలా మందిలో పగలు, ప్రతీకారాలు పెరిగిపోతున్నాయి. వీటితో పాటు అసూయ అనే మరొక భూతం కూడా మనుష్లులో వచ్చి చేరుతుంది. ఈ అసూయ గల వ్యక్తి .. ఎదుటి వ్యక్తి హాని చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంకా దారుణం ఏమిటంటే దీనికి కారణంగా అనేక హత్యలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తమ కంటే సంపాదన, కీర్తి ప్రతిష్ఠలు, ఆస్తులు వంటి ఇతర వస్తువులు ఎక్కువగా ఉన్నాయని కొందరు అసూయ పెంచుకుని హత్యలు చేస్తుంటారు. తాజాగా అలానే అసూయ.. ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. తనతో పాటే వ్యభిచారం చేస్తూ తన కన్నా అందంగా ఉండి, ఎక్కువ డబ్బు సంపాదిస్తుందనే అసూయతో ఓ మహిళ మరొక మహిళను చంపేసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం గంగన్న గూడెంకు చెందిన గీత (పేరు మార్చాం) అనే మహిళ ఫరూక్ నగర్ మండలం కమ్మదనంలో నివసిస్తోంది. సుజాత (పేరు మార్చాం) అనే మహిళ కూడా అదే ప్రాంతంలో నివాసం ఉంటుంది. ఇద్దరూ వ్యభిచారం చేస్తూ జీవనం సాగిస్తోన్నారు. ఇద్దరూ ఒంటరి వాళ్లు కావడంతో వారి మధ్య స్నేహం ఏర్పడింది. ఎంతో మంది పరిచయాలతో వీరు వ్యభిచార వృతిని కొంతకాలంగా నడుపుతున్నారు. షాద్ నగర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వీరు వ్యభిచార వృత్తిని నడుపుతుండేవారు. అయితే తన కన్న గీత అందంగా ఉండి డబ్బులు ఎక్కువ సంపాందిస్తుందనే అసూయ సుజాతలో పడిపోయింది.
దీంతో గీతపై సుజాత అసూయ పెంచుకుంది. ఈ వృత్తిలో తాను బాగా సంపాందించాలంటే గీత అడ్డుతొలగించుకోవాలని సుజాత భావించింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లో స్వీపర్ గా పనిచేసే లింగం సహకారంతో గీతను చంపాలని సుజాత పథకం రచించింది. ఈక్రమంలో అక్టోబర్ 23న గీతను పార్టీ ఇస్తానంటూ సుజాత తన ఇంటికి ఆహ్వానించింది. ఇద్దరు కలసి రాత్రి చాలా సేపు పూటుగా మద్యం తాగారు. అనంతరం లింగంతో కలిసి మద్యం మత్తులో ఉన్న గీత ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది. ఎవరికి అనుమానం రాకుండా శవాన్ని గోనెసంచిలో కుక్కి తంగెళ్లపల్లి సమీపంలోని వాగు పక్కన పడేసింది. ఉదయం గీత మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటన స్థలంకి చేరుకున్న పోలీసులు ఆధారాలకోసం చుట్టుపక్కల పరిశీలించారు. ఈక్రమంలో అక్కడ రెండు బస్సు టికెట్లు లభించాయి. వీటి ఆధారంగా మృతురాలిని పోలీసులు గుర్తించారు. సీసీ పుటేజీలో లింగం, సుజాత బైక్ పై ఒక మూటను పెట్టుకొని వెళ్లినట్లు పోలీసులు గమనించారు. వీటి ఆధారంగా నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వారి నుంచి రెండు తులాల బంగారం, చెవి పట్టీలు, కాళ్ల గొలుసులు, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా చేధించినందుకు పోలీసులను ఏసీపీ కుషాల్కర్ అభినందించారు.