ఈ మధ్యకాలంలో ప్రేమ వ్యవహారంతో అనేక దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రేమించిన వ్యక్తి కోసం తల్లిదండ్రులపై దాడి చేయడం, లేక తామే ఆత్మహత్య చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి. తాజాగా ఓ యువతి ఇష్టంలేని పెళ్లి చేశారని ప్రియుడి కలిసి పారిపోయింది. నాలుగు రోజుల తరువాత చూస్తే..
ప్రేమ అనే రెండు అక్షరాల పదం మనిషిని ఎక్కడి దాకైనా తీసుకెళ్తుంది. ఈ ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో ఎవరం చెప్పలేము. ఈ ప్రేమల్లో కొన్ని విజయతీరానికి చేరగా మరికొన్నిటి కథ విషాదాంతం అవుతోంది. కొందరు పెద్దలు పరువు పోతుందని తమ పిల్లలను అత్యంత దారుణంగా చంపేస్తున్నారు. మరొకవైపు పెద్దలు ఒప్పుకోలేదని కొందరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా అలాగే ఓ జంట ప్రేమ కథ విషాదాంతం అయింది. వేరొకరితో ఇష్టంలేని పెళ్లి చేయడంతో ప్రియుడితో కలిసి పారియిపోయిన ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకరమైన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మెదక్ జిల్లాకు చెందిన కల్పన, ఖలీల్ అనే యువతియువకులు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఖలీల్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇలా ఆటో నడుపుతున్న సమయంలో కల్పనకు ఖలీల్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి చాలా కాలం పాటు ప్రేమించుకున్నారు. ఇదే సమయంలో పెళ్లి చేసుకోవాలని వారిద్దరు నిర్ణయించుకున్నారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం ఇద్దరి ఇళ్లలో తెలిసింది. వారిద్దరి మతాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు వీరికి పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే కల్పనకు రెండు నెలల క్రితం వేరొక వ్యక్తితో ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి జరిపించారు. ఇష్టం లేకున్న పెద్దల బలవంతంతో ప్రేమించిన వ్యక్తిని మనస్సులో పెట్టుకుని మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
ఖలీల్ పై ప్రేమను చంపుకోలేకపోయింది. ఈ క్రమంలోనే శివరాత్రి పండగ కోసం ఫిబ్రవరి 9న నార్సింగ్ లోని అత్తాగారింటికి కల్పన వచ్చింది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఇంటి నుంచి కల్పన అదృశ్యమైంది. తమ కూతురు కనిపించడం లేదంటూ యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు వెతకటం ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లో ఉండే సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. మంగళవారం నార్సింగిలో బస్సు ఎక్కి రామాయంపేటలో యువతి దిగినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి బైక్ పై మరో వ్యక్తితో కలిసి కల్పన వెళ్లినట్లు సీసీ కెమెరాలో పోలీసులు గుర్తించారు. ఈ వీడియో ఆధారంగా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలోనే నార్సింగ్ చెరువు ఒడ్డున మంగళవారం బైక్, యువతియువకుల చెప్పులు కనిపించాయి. ఇవి కనిపించకుండా పోయిన కల్పన, ఖలీల్ కి సంబంధించినవే అని పోలీసులు భావించారు. చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానించారు. ఈ క్రమంలోనే మంగళవారం నుంచి బుధవారం వరకు గజ ఈతగాళ్లు తీవ్రంగా గాలించారు. ఆఖరికి వలల సహాయంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేసినప్పటికీ ఎవరీ కనిపించలేదు. ఇక లాభం లేదనుకున్న పోలీసులు చెరువులో గాలించడం ఆపేశారు. మరుసటి రోజు గురువారం ఉదయం ఇద్దరి శవాలు ఒక్కసారిగా చెరువులో తేలాయి.
యువతికి ఇష్టం లేని పెళ్లి చేయడంతో ఈ ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రేమ జంట ఆత్మహత్య ఘటనపై పోలీసులు మరో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇరు కుటుంబాల సభ్యులను, బంధువులను ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఎంతో భవిష్యత్ ఉన్న ఆ యువతకు అప్పుడే నిండు నూరేళ్ల నిండాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెట్స్ రూపంలో తెలియజేయండి.