నిత్యం ఎక్కడొ ఒక్కచోట ఆడవారిపై వేధింపులు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం అయితే వరకట్న వేధింపులకు ఎందరో ఆడవారు బలయ్యారు. అయితే ఇటీవల కాలంలో అలాంటి ఘటనలు చాలా వరకు తగ్గాయి. మహిళల్లో చైతన్యం రావడం, వారు ఉన్నత చదువులు, ఉద్యోగాలు చేయడం అందుకు ప్రధాన కారణం. అయితే ఇంతాల మహిళలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్న.. ఇంకా పలు చోట్ల వారిపై వరకట్నం, లైంగిక వేధింపులు వంటివి జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి వేధింపులకు ఓ మహిళతో పాటు 10 నెలల పసిపాప ప్రాణాలు బలైపోయాయి. భర్త, అత్తింటి వారి వేధింపులకు తట్టుకోలేక పసిబిడ్డతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హన్మకొండ జిల్లా శాయంపేట మండలం కాట్రపల్లికి చెందిన ఆమని(29)ని ఆత్మకూరు మండలం హౌజుబుజుర్గు గ్రామానికి చెందిన నిమ్మల మురళికి ఇచ్చి.. ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేశారు. పెళ్లి సమయంలో ఆమనికి.. ఆమె పుట్టింటి వారు రూ.8 లక్షలు, కాట్రపల్లిలో ఎకరం వ్యవసాయ భూమిని కట్నం కింద ఇచ్చారు. పెళ్లై కొంతకాలం గడిచిన తరువాత అదనపు కట్నం తేవాలంటూ భర్త మురళి, అత్తమామలు స్వరూప, బుచ్చయ్యలు ఆమనిని నిత్యం వేధించేవారు. అంతేకాక ఆమెకు కట్నంగా ఇచ్చిన ఎకరం భూమిని అమ్మాలంటూ ఒత్తిడి చేసేవారు. ఇలా నిత్యం నరకం అనుభవిస్తూనే ఉంది. అంతేకాక పెళ్లయ్యాక ఏడేళ్ల వరకు పిల్లలు పుట్టలేదు. దీంతో మరొక వివాహం చేసుకుంటానని మురళి .. ఆమనిని బెదిరించేవాడు.
దీంతో ఈ విషయాన్ని పుట్టింటి వారికి చెప్పుకుని ఆమని బాధ పడింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఈ విషయాన్ని పెద్దల వద్ద పంచాయితీ పెట్టారు. ఇలా పలుమార్లు జరిగినా మురళిలో మార్పు రాలేదు. అయితే వివాదాలు జరుగుతున్న క్రమంలోనే ఈ దంపతులకు పది నెలల క్రితం అశ్రిత సాయి అనే పాప పుట్టింది. లేక లేక బిడ్డ పుట్టడంతో .. ఆ పాపను చూసుకుంటూ అత్తింటి వారి వేధింపులను భర్తిస్తూ వచ్చింది. అయిన పొలం అమ్మాలంటూ వారి వేధింపులు శృతి మించాయి. దీంతో మూడు రోజుల కిందట ఆమని తన తల్లి రావుల సరళకు ఫోన్ చేసి తనకు కట్నంగా ఇచ్చిన భూమిని అమ్మి డబ్బులు పంపిచాలని వేడుకుంది. పొలం అమ్మే పనిలోనే ఉన్న ఆమని తల్లిదండ్రులకు పిడుగు లాంటి వార్త వినిపించింది.
గురువారం ఉదయం ఆసుపత్రికి వెళ్తానంటూ బిడ్డతో సహా ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమని.. చీకటిపడిన ఇంటికి రాలేదు. దీంతో ఆమె కోసం గాలించగా.. దామెర మండలంలోని ఊరుగొండ వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో శుక్రవారం విగతజీవులుగా కనిపించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అదనపు కట్నం తెమ్మని, ఆడపిల్ల పుట్టిందని తన కుమార్తెను అత్తింటివారు వేధించారని ఆమని తల్లిదండ్రులు తెలిపారు. తమ కూతురి మృతిపై అనుమానాలున్నాయని తల్లి సరళ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిప్రియ తెలిపారు.