నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నకిరేకల్ శివారులో జాతీయ రహదారిపై కాలేజీ బస్సును వెనకవైపు నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో కాలేజీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది విద్యార్థులు గాయపడ్డారు. సూర్యపేటకు చెందిన భవాని స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు నల్లగొండ జిల్లా కేంద్రంలో పరీక్షలు రాయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూర్యపేటకు చెందిన భవాని స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు నల్లగొండ జిల్లా కేంద్రంలో పరీక్షలు రాయడానికి బయలుదేరారు. ఈ క్రమంలో నకిరేకల్ శివారులో 65వ నెంబర్ జాతీయ రహదారిపై కాలేజీ బస్సు సర్వీస్ రోడ్డు క్రాస్ అవుతున్న సమయంలో వెనకవైపు నుంచి లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కాలేజీ బస్సులో సుమారు 46 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 30 మందికి గాయాలవ్వగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడ్డవారిని సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.