వారిద్దరు ప్రేమించుకున్నారు.. పైగా వరసకు బంధువులు కూడా. దాంతో పెళ్లి చేసుకుని అందమైన జీవితం గడుపుదాం అని ఎన్నో కలలు కూడా కన్నారు. వారి ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో సినిమాల్లో లాగా గొడవలు జరిగాయి. ఇద్దర్ని మాట్లాడుకోవద్దని, కలుసుకోవద్దని కండీషన్ పెట్టారు మనసు లేని పెద్ద మనుషులు. దాంతో ఇద్దరు విడిపోయారు.. కానీ మనసులు మాత్రం కలిసే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ యువతికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. కొన్ని రోజుల క్రీతమే వివాహం కూడా జరిపించారు. ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక, ఇటు ఇష్టం లేని వ్యక్తితో కాపురం చేయలేక దారుణం నిర్ణయం తీసుకుంది ఆ యువతి. మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం విలేజ్ కు చెందిన ఉడుత గణేష్(25), నలంద (23) లు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇక వారి ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో.. వారిని మందలించారు. ఇప్పటి నుంచి మాట్లాడుకోవడం కానీ, కలవడం కానీ చెయ్యరాదని పెద్దలు కండీషన్ పెట్టారు. దాంతో గణేష్, నలందల జంట విడిపోయింది. ఇక్కడ విశేషం ఏంటంటే? వారిద్దరు వరసకు బంధువులు కూడా. ఈ క్రమంలోనే నలందకు యాదగిరి గుట్టకు చెందిన వ్యక్తితో పెళ్లి జరిపించారు. గణేష్ మాత్రం నలంద కోసమే పెళ్లి చేసుకోకుండా వేచి చూస్తున్నాడు. యాదాద్రి దేవస్థానంలో నలంద భర్త ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలోనే మంగళవారం తన విధులు ముగించుకుని రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చిన అతడికి భార్య నలంద కనిపించలేదు. చుట్టు పక్కల వెతికి.. స్థానికి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మరోవైపు గణేష్ సైతం అదే టైమ్ కు కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుడే తెల్లవారు జామున 3 గంటలకు గూడ్స్ రైలు కింద ఓ జంట పడిందని లోకో పైలట్ నుంచి స్టేషన్ మాస్టర్ కు సమాచారం అందింది. దాంతో అతడు రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గణేష్ మృతదేహం దగ్గర లభించిన సెల్ ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విగత జీవులుగా పడి ఉన్న ప్రేమ జంటను చూసి.. కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్ననట్లు పోలీసులు తెలిపారు.