రిజిస్ట్రేషన్, స్టాంపుల యూజర్ ఛార్జీలను పెంచింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి కొత్త యూజర్ ఛార్జీలు అమలులోకి వచ్చాయి. మరి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ ఛార్జీలు ఎంత ఉన్నాయో తెలుసుకోండి.
రిజిస్ట్రేషన్, స్టాంపుల యూజర్ ఛార్జీల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ యూజర్ ఛార్జీలను భారీగా పెంచింది. ఈ మార్పును 24 గంటల్లో అమలు చేయాలని సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం నుంచి అమలు చేయాలని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ జిల్లా అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ యూజర్ ఛార్జీలు పెరిగాయి. మంగళవారం నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చాయని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ తెలిపింది. మార్కెట్ విలువను సూచించే డాక్యుమెంట్ కు రూ. 10 నుంచి రూ. 50కి పెంచింది. అలానే ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) కి రూ. 10 నుంచి రూ. 100 కు పెంచింది.
సేల్ డీడ్ లు, వీలునామా, గిఫ్ట్ డీడ్, పవరాఫ్ అటార్నీలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఛార్జీలు రూ. 500కి పెంచింది. వాణిజ్య సంస్థ, బైలా సొసైటీల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కి రూ. 100 ఛార్జ్ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రిజిస్ట్రేషన్ చేయవలసిన దస్తావేజులు పది కంటే ఎక్కువగా ఉంటే గనుక ఒక్కో పేజీకి రూ. 10 పెంచింది. గతంలో ఇది రూ. 5 ఉండేది. సర్టిఫైడ్ కాపీకి రూ. 20 నుంచి రూ. 100కు పెంచింది. ప్రతీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జీ రూ. 100 నుంచి రూ. 200 వరకూ ఉంటే ఇప్పుడు రూ. 500కి పెంచింది. రూ. 5 వేల లోపు స్టాంపులు కొనుగోలు చేస్తే గతంలో రూ. 10 ఉండగా.. ఇప్పుడు రూ. 50 అయ్యింది. రూ. 5 వేల కంటే ఎక్కువ స్టాంపులు కొనుగోలు చేస్తే గతంలో రూ. 20 ఉండగా.. ఇప్పుడు రూ. 100 అయ్యింది.
రూ. 10 వేల నుంచి రూ. 99,999 మధ్య స్టాంపులను కొనుగోలు చేస్తే గతంలో రూ. 10 ఉండగా.. ఇప్పుడు రూ. 50కి పెంచింది ప్రభుత్వం. రూ. లక్ష కంటే ఎక్కువ స్టాంపులు కొనుగోలు చేస్తే రూ. 100 వసూలు చేస్తుంది. గతంలో ఇది రూ. 20 ఉండేది. సర్టిఫైడ్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ గతంలో రూ. 50 ఉండగా.. ఇప్పుడు రూ. 100 చేసింది. రిజిస్టర్డ్ సొసైటీ సర్టిఫైడ్ కాపీ రూ. 50 నుంచి రూ. 100కి పెంచింది. కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కింద అందించే సేవల్లో భాగంగా హార్డ్వేర్ నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్, పవర్ బ్యాకప్, విద్యుత్ బిల్లు, ఇతర అవసరాలకు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో యూజర్ ఛార్జీలను పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది.