ప్రముఖ చారిత్రక నవలా రచయిత, ‘చారిత్రక నవలా చక్రవర్తి’గా ఖ్యాతి గడించిన ముదిగొండ శివప్రసాద్ కన్నుమూశారు. గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గురువారం రాత్రి గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 8:45 గంటల సమయంలో మరోసారి గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు..
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో 1940 డిసెంబర్ 23న జన్మించారు ముదిగొండ శివప్రసాద్. పుట్టింది ఆంధ్రాలో అయినప్పటికీ, ఆయన సాహిత్య ప్రస్థానం, ఉద్యోగ జీవితం అంతా తెలంగాణ గడ్డపైనే, హైదరాబాద్‌లోనే సాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో ఆచార్యులుగా పని చేస్తూ ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. బోధనను కేవలం వృత్తిగా కాక, ఒక బాధ్యతగా భావించిన ఆయన… విద్యార్థులలో సాహిత్యం పట్ల మక్కువ పెంచడంలో కీలక పాత్ర పోషించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రిటైర్ అయినప్పటికీ, ఆయనలోని రచయిత మాత్రం ఎప్పుడూ విశ్రాంతి తీసుకోలేదు.ముదిగొండ శివప్రసాద్ గొప్పతనం అంతా ఆయన రాసిన చారిత్రక నవలల్లోనే ఉంది. తన సుదీర్ఘ సాహిత్య జీవితంలో ఆయన 80కి పైగా గ్రంథాలు రచించగా… అందులో 20కి పైగా అరుదైన చారిత్రక నవలలు ఉన్నాయి.’చరిత్రను కల్పనలతో చంపకూడదు, ఉన్న వాస్తవాలను ఆసక్తికరంగా చెప్పాలి’ అనేదే ఆయన సిద్ధాంతం. ఆయన రాసిన ‘కాకతీయ కళాదర్శనం’, ‘తంజావూరు విజయం’, ‘రెసిడెన్సీ’, ‘శ్రీలేఖ’, ‘ఆవాహన’, ‘శ్రీపదార్చన’ వంటి నవలలు తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టించాయి. ఒక చారిత్రక నవల రాయడానికి ఆయన నెలల తరబడి గ్రంథాలయాలు తిరుగుతూ, చిన్న చిన్న విషయాలను సైతం పరిశోధించి మరీ రాసేవారు. అందుకే ఆయన రచనలు చదువుతుంటే, పాఠకులు నేరుగా ఆ కాలంలోకి ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది.

కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సినిమా రంగంతోనూ ఆయనకు మంచి అనుబంధం ఉంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చారిత్రక చిత్రం ‘రుద్రమదేవి’ సినిమాకు ముదిగొండ శివప్రసాద్ రచనా సహకారం అందించారు. చరిత్రపై ఆయనకున్న పట్టును చూసి ఎంతోమంది సినీ దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోయేవారు. తాళ్లపాక అన్నమాచార్య జీవిత చరిత్ర ఆధారంగా ఆయన రాసిన ‘శ్రీపదార్చన’ నవల లక్షలాది పుస్తకాలు అమ్ముడై చరిత్ర సృష్టించింది.”ఇక గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 86 ఏళ్ల ముదిగొండ శివప్రసాద్ గుండెపోటుతో హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయానికి ఇవాళ అంబర్‌పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా… ఆయన రాసిన ప్రతి అక్షరం, ప్రతి చారిత్రక నవల తెలుగు జాతి ఉన్నంతవరకు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
