సోషల్ మీడియాలో తన వీడియాలు అప్లోడ్ చేస్తూ లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ప్రముఖ యూట్యూబర్ మధుమిత ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. పోలీసుల దర్యాప్తునకు భయపడి ఆమె తన భర్త, కుమార్తెతో కలిసి ఇంటికి తాళం వేసి పరారైన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
తమిళనాడు నాగర్‌కోవిల్ సమీపంలోని తమ్మత్తుక్కోణం ప్రాంతానికి చెందిన మధుమిత ప్రముఖ యూట్యూబర్‌గా మంచి గుర్తింపు పొందింది. అయితే, తన సోషల్ మీడియా ఖాతాల్లో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, కట్టల కొద్దీ నగదు చూపిస్తూ వీడియోలు పోస్ట్ చేయడం ఆమెకు అలవాటుగా మారింది. ఈ వీడియోలను చూసిన కొందరు దుండగులు ఆమె ఇంటిపై కన్ను వేశారు. ఇటీవల నలుగురు వ్యక్తులు ఆమె ఇంటి నుంచి ఏకంగా 118 సవర్ల బంగారాన్ని చోరీ చేశారు. ఈ భారీ దొంగతనంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పోలీసులు విచారణ ప్రారంభించారు.

అయితే ఈ చోరీ కేసు విచారణ కొనసాగుతుండగానే మధుమితకు ఊహించని విధంగా మరో పెద్ద షాక్ తగిలింది. తిరునెల్వేలికి చెందిన ఒక కాంట్రాక్టర్ మధుమితపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. తన వద్ద ఉన్న 5 సవర్ల బంగారు గొలుసును మధుమిత అక్రమంగా దోచుకుందని ఆయన ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెపై మరో కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల నేపథ్యంలో పోలీసులు మధుమితను సమగ్రంగా విచారించేందుకు సిద్ధమవడంతో, ఆ విచారణకు భయపడి ఆమె అర్ధరాత్రి వేళ తన ఇంటికి తాళం వేసి భర్త, కుమార్తెతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు.
ఒకవైపు పోలీసుల విచారణ నుంచి తప్పించుకునేందుకు మధుమిత పరారైనప్పటికీ, సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఆమె పేరు మారుమోగిపోతోంది. ఈ వివాదం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మధుమితకు సంబంధించిన పాత వీడియోలు, రీల్స్ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చిత్రమైన విషయమేంటంటే.. ఆమెపై కేసులు నమోదు కావడం, పరారీలో ఉండటంతో యూజర్ల క్యూరియాసిటీ పెరిగిపోయి, ఆమె సోషల్ మీడియా ఖాతాల ఫాలోవర్ల సంఖ్య గంటగంటకూ భారీగా పెరుగుతోంది. ఈ పరిణామం నెటిజన్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సోషల్ మీడియాలో లభించే పాపులారిటీ, లైక్‌ల కోసం అతిగా వ్యక్తిగత ఆస్తులను ప్రదర్శించడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టం చేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా పరారీలో ఉన్న మధుమిత కుటుంబం కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
