తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష చేపట్టిన యువతి పోరాటం ఫలించింది. శ్రీకాంత్‌తో తనకు వివాహం జరిపించాలని కోరుతూ శ్రీదేవి గత నాలుగు రోజులుగా వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ పాలకుర్తి సారంగపాణి ఇంటి ఎదుట దీక్ష చేపట్టింది. ఈక్రమంలో సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చొరవ తీసుకున్నారు. శ్రీకాంత్, అతని కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించడంతో పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. దీంతో నాలుగు రోజులుగా కొనసాగిన శ్రీదేవి దీక్షకు తెరపడింది. ఈ వివాహంతో అక్కడి వాతావరణం సందడిగా మారింది
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మూడేళ్ల క్రితం శ్రీదేవికి, మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్‌కి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని శ్రీకాంత్ నమ్మించాడని, అయితే కొద్ది రోజులుగా అతను పెళ్లికి నిరాకరిస్తూ ముఖం చాటేయడంతో శ్రీదేవి తీవ్ర ఆవేదనకు గురైంది. తన జీవితంతో ఆటలాడుకున్నాడని భావించిన ఆమె, తనకు న్యాయం జరగాలంటూ నేరుగా రంగంలోకి దిగింది.

ఇదిగో ఇక్కడే అసలు నాటకం మొదలైంది. శ్రీకాంత్‌తో తనకు వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తూ శ్రీదేవి… ఏకంగా వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఇంటి ఎదుటే బైఠాయించి దీక్షకు దిగింది. వర్షం, ఎండ లెక్కచేయకుండా ఆమె చేపట్టిన ఈ నిరసన దీక్ష ఆ ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ఇల్లు కావడం, మరోవైపు దళిత యువతి తన ప్రేమ కోసం ఒంటరి పోరాటం చేస్తుండటంతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రోజురోజుకు ఆమె దీక్ష కొనసాగుతుండటంతో ఉద్రిక్తత పెరిగింది.
నాలుగు రోజులుగా శ్రీదేవి దీక్ష కొనసాగుతుండటంతో పరిస్థితి చేయి దాటిపోయే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ వివాదంపై ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తాను కూడా అంతకుముందు ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తి కావడంతో… ఒక ప్రేమికురాలి ఆవేదనను ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన ఎమ్మెల్యే, చైర్మన్ కుటుంబ సభ్యులతో మరియు శ్రీకాంత్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ‘ప్రేమించిన యువతీ యువకుల భవిష్యత్తును కాపాడాలి తప్ప, ఇలాంటి విషయాల్లో పంతాలకు పోకూడదు’ అంటూ పెద్దరికంతో ఇరు కుటుంబాలను ఒప్పించడంలో సఫలమయ్యారు. ఇక ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు చొరవతో ఎట్టకేలకు శ్రీకాంత్ మరియు అతని కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి అంగీకరించారు. దీంతో నాలుగు రోజులుగా కొనసాగిస్తున్న శ్రీదేవి దీక్ష ముగిసింది. పెద్దల సమక్షంలో శ్రీకాంత్, శ్రీదేవిల వివాహం ప్రశాంతంగా జరిగింది.
ఇరువర్గాల దండల మార్పిడితో అక్కడ ఒక్కసారిగా వాతావరణం సందడిగా మారింది. దళిత సంఘాల ప్రతినిధులు, స్థానికులు, మహిళలు ఈ పెళ్లిపై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన నూతన దంపతులకు… ఎమ్మెల్యే నాగరాజు దంపతులు పెళ్లి వస్త్రాలు అందించి ఆశీర్వదించారు. పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా… శ్రీదేవి తన హక్కు కోసం చేసిన దీక్ష చివరకు విజయవంతమైంది..ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది..
