మద్యం ముగ్గురి కుటుంబాల్లో విషాదం నింపింది. కారు కొన్న ఆనందాన్ని స్నేహితులతో పంచుకుందామనుకున్నాడు. కానీ ఆ ఆనందం ఎంత సేపు నిలువలేదు. పార్టీ చేసుకునేందుకు వెళ్లి .. ముగ్గురు విగత జీవులుగా మారారు. ఈ ఘటన కృష్ణా జిల్లా చోడవరంలో చోటుచేసుకుంది.
మద్యం అనేక ఇళ్లల్లో విషాదం నింపుతోంది. మద్యం వల్ల కుటుంబాలు నాశనమౌతున్నాయి. కుటుంబాల్లో కలహలకు కారణమౌతుంది. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీరి వల్ల అమాయక జీవితాలు కూడా బలౌతున్నాయి. ఇదే మద్యం ముగ్గురు ప్రాణ స్నేహితులు బలిగొని, వారి ఇళ్లలో విషాదం నింపింది. కొత్త కారు కొన్నామన్న ఆనందాన్ని కొన్ని గంటల్లోనే ఆవిరి చేసింది. కారు కొన్న సందర్భంగా పార్టీ చేసుకునేందుకు వెళ్లిన ఆ ముగ్గురు విగత జీవులుగా మారారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా చోడవరంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన అబ్దుల్ రహీం(34) ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు. అతడు ఇటీవల ఓ కొత్త కారును కొన్నాడు. కారు కొన్న సందర్భంగా స్నేహితులు షేక్ ఖలీషా(30), తాళ్లూరి కిరణ్(37)కు పార్టీకి ఆహ్వానించాడు. తన కారులోనే స్నేహితులను ఎక్కించుకుని మద్యం బాటిల్లు, ఆహారం తీసుకుని పార్టీ చేసుకోడానికి కృష్ణా నది తీరానికి వెళ్లాడు. ఇలా ముగ్గురు స్నేహితులు చోడవరం ఘాట్‌లో కారును నిలిపి వాహనంలోనే మద్యం సేవించారు. అనంతరం ఆ మత్తులోనే ముగ్గురు కృష్ణా నదిలో ఈతకు దిగారు. కానీ మద్యం మత్తులో ఈదడం సాధ్యంకాక నీటిలో గల్లంతయ్యారు. రాత్రి వేళలో ఈ ఘటన జరగడంతో వారి కేకలు కూడా ఎవ్వరికీ వినిపించలేదు.
ఘాట్ వద్ద ఖరీదైన కారు ఆగి ఉండటం, చుట్టు ప్రక్కల ఎవ్వరూ లేకపోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారును తెరిచి చూడగా అందులో మద్యం బాటిల్స్, ఆహారం కనిపించింది. అనుమానంతో చుట్టుపక్కల చూడగా ఓ చోట చెప్పులు, బట్టలు కనిపించాయి. దీంతో నదిలోకి ఈతకు దిగి గల్లంతయ్యి ఉంటారని పోలీసులు అనుమానించారు.
పోలీసులు, బాధిత కుటుంబాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అతడు కొత్తగా కారు కొనుక్కుని స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. గజ ఈతగాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కృష్ణా నదిలో గాలింపు చేపట్టి ముందుగా ఖలీషా,రహీం మృతదేహాలు బయటకు తీశారు.
శుక్రవారం రాత్రివరకు గాలింపు చేపట్టినా కిరణ్ మృతదేహం లభించకపోవడంతో శనివారం కూడా కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల కుటుంబసభ్యుల రోదనలతో కృష్ణా తీరంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లభించిన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నదులు, నీటి ప్రవాహాల ఒడ్డున మందు పార్టీలు చేసుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. మద్యం మత్తులో నదిలోకి దిగితే ఇటువంటి ప్రమాదాలు సంభవించే అవకాశాలుంటాయని చెబుతున్నారు.