వాన రాకడ.. ప్రాణం పోకడ చెప్పిరావు అని అంటారు.. అప్పటి వరకు మనతో సంతోషంగా ఉన్నవారు అకస్మాత్తుగా ఈ లోకాన్ని వీడిపోతుంటారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో జరుగుతుంటాయి. ఈ మద్య రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. అందరు డ్రైవర్లు అలాగే ఉండరని.. కొన్ని సమయాల్లో తమ ప్రాణాలు లెక్కచేయకుండ ప్రయాణీకుల ప్రాణాలు రక్షించిన డ్రైవర్లు ఉన్నారు. తాజాగా ఓ డ్రైవర్ తనకు గుండెపోటు వస్తున్నా.. ఊపిరి బిగబట్టి బస్సును సురక్షిత ప్రదేశానికి తీసుకు వెళ్లి ఆపి ప్రయాణీకులు ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఈ నెల 16న కాకినాడకు చెందిన 42 మంది అయ్యప్ప స్వాములు శబరిమల వెళ్లి స్వామి వారి దర్శించుకునేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ని మాట్లాడారు. శబరిమల వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. గురువారం నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు.. బొగోలు మండలానికి చేరుకోగానే బస్సు డ్రైవర్ భాస్కర్ రావు కి ఉన్నట్టుండి గుండెనొప్పి రావడం మొదలైంది. తనకు గుండె నొప్పి వస్తుందని చెబితే బస్సులో ఉన్న స్వాములు బయపడతారేనే బాధతో ఆ నొప్పిని భరిస్తూ బస్సుని నడిపాడు.. అక్కడ ఫ్లైఓవర్ రావడంతో ఇక నడిపించే ఓపికలేక బస్సును సురక్షిత ప్రదేశంలో ఆపాడు. అలాగే సీటుపై ఒరిగిపోయాడు.. డ్రైవర్ వద్దకు వచ్చిన స్వాములు ఏమైందని అడిగే లోపే ఆయన కన్నుమూశాడు.
గుండె నొప్పి భరిస్తూ కూడా తమ ప్రాణాలు రక్షించిన డ్రైవర్ భాస్కర్ రావు చేసిన సాహసాన్ని అయ్యప్ప స్వాములు ఎంతగానో కొనియాడారు… ఓ పక్క ప్రాణాలు పోతాయని తెలిసి కూడా తమ ప్రాణాలు కాపాడిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థించారు. డ్రైవర్ భాస్కర్ రావు మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి అంబులెన్స్ లో పంపించారు. మరో డ్రైవర్ సహాయంతో తమ ఊరికి చేరుకున్నారు 42 మంది స్వాములు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తాను చనిపోతానని తెలిసికూడా చాకచక్యంగా వ్యవహరించి 42 మంది ప్రాణాలు రక్షించిన డ్రైవర్ అన్నా.. నీకు హ్యాట్సాఫ్.. నువు నిజంగా రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.