గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ- ప్రతిపక్షాల నుంచి బాగా వినిపిస్తున్న పేరు జీవో నెంబరు 1. ఈ జీవో ప్రజల కోసం తీసుకొచ్చామని ప్రభుత్వం.. ఇది ప్రతిపక్షాలను అణచివేయడానికే అని విపక్షం వాదించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ జీవోని విశ్రాంత ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీ నారాయణలాంటి వారు సమర్థించడం కూడా చూశాం. ఈ జీవో విడుదల చేసిన దగ్గరి నుంచి దీనిపై రాద్దాంతం జరుగుతూనే ఉంది. తాజాగా ఈ జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది.
జీవో నెంబర్ 1కి వ్యతిరేంకగా సీపీఐ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ప్రస్తుతానికి ఈ జీవోని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. జనవరి 23 వరకు జీవోని సస్పెండ్ చేశారు. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జీవో నెంబర్ 1 నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది.
జీవో నెంబర్ 1కి సంబంధించి మొదటి నుంచి ప్రభుత్వం, అధికారులు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. జీవో నెంబర్ 1పై దుష్ప్రచారం జరుగుతోందంటూ తాజాగా ఏపీ అడిషనల్ డీజీపీ రవి శంకర్ అయ్యన్నార్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జీవోలో ఎక్కడా సభలు, సమావేశాలు నిషేదిస్తామని చెప్పలేదన్నారు. 1861 పోలీస్ యాక్టుకు లోబడే జీవో నెంబర్ 1ని రూపొందించినట్లు వివరణ ఇచ్చారు. నిబంధనలకు లోబడి సమావేశాలకు, సభలు అనుమతులు ఇస్తామన్నారు. ప్రజలకు అసౌకర్యం జరగకుండా సభలు నిర్వహించుకోవాలన్నారు. రహదారులు, రోడ్లపై సభలకు అనుమతి లేదన్న ఆయన.. అత్యవసరమైతే నిర్వహించుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం హైకోర్టు సస్పెండ్ చేయడంతో జీవో నెంబర్ 1 మళ్లీ చర్చనీయాంశం అయ్యింది.