Bigg Boss Show: బిగ్‌బాస్ షోలో అశ్లీలత ఎక్కువయిదంటూ, షోను బ్యాన్ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది శివ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. బిగ్‌బాస్ షో ఐబీఎస్ గైడ్ లైన్స్ పాటించలేదని పేర్కొన్నారు. అంతేకాక! షోలో అశ్లీలత ఎక్కువయిందని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు బిగ్ బాస్ షోలో అశ్లీలతపై ఘాటుగా స్పందించింది. 1970లలో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా అని ప్రశ్నించింది. ప్రతి వాదులకు నోటీసులపై తదుపరి వాయిదాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇక, దీనిపై స్పందించటానికి కేంద్రం తరపు న్యాయవాది సమయం కోరారు. దీంతో హైకోర్టు విచారణను అక్టోబర్ 11కు వాయిదా వేసింది.
కాగా, బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ 2017లో మొదలైంది. ఈ మొదటి సీజన్‌కు జూ. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ సీజన్ విన్నర్‌గా శివ బాలాజీ నిలిచాడు. ఇక, రెండవ సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించగా.. మూడవ సీజన్‌నుంచి నాగార్జున్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సీజన్ 6 నడుస్తోంది. ఈ సీజన్ సెప్టెంబర్ 4న ప్రారంభం అయింది. మొత్తం 21 మంది హౌస్‌మేట్స్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే, 24 గంటల లైవ్ స్ట్రీమింగ్ కారణంగా షో ప్రాధాన్యత తగ్గిపోయింది. ప్రేక్షకులు ముందు సీజన్లకు చూపించినంత ఆసక్తి చూపించటం లేదు. షో తూతూ మంత్రంగానే ముందుకు సాగుతోంది.