మాతృ దినోత్సవం నాడు కాబోయే మాతృమూర్తులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాబోయే తల్లులు అనగా గర్భిణీలు ఇక నుంచి ఆ వైద్య సేవలను ఉచితంగా పొందవచ్చు.
పేదవారికి, ఆర్థికంగా వెనుకబడిన వారికి సంక్షేమ పథకాలను అందజేస్తున్న ఏపీ ప్రభుత్వం గర్భిణీలకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే గర్భిణీలకు, బాలింతలకు సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ కింద సరుకులను జూలై 1 నుంచి నేరుగా వారి ఇంటికే సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న ఈ సరుకులను జూలై నుంచి నేరుగా బాలింతలు, గర్భిణీల ఇంటికి వెళ్లనున్నాయి. బియ్యం, కందిపప్పు, పాలు, గుడ్లు, నూనె, అటుకులు, బెల్లం, ఎండు ఖర్జూరం వంటి సరుకులు పంపిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం గర్భిణీలకు మరొక శుభవార్త చెప్పింది. ఆ వైద్య సేవలను గర్భిణీలు ఉచితంగా పొందవచ్చునని తెలిపింది.
గర్భిణీల కోసం ఉచితంగా అత్యాధునిక టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ (టిఫా) స్కానింగ్ సేవలను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. గర్భిణీలకు 18 నుంచి 22 వారాల దశలో టిఫా స్కానింగ్ చేయించుకోమని వైద్యులు చెబుతారు. తల్లి గర్భంలో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని, పిండం ఎదుగుదలలో ఏమైనా లోపాలు ఉంటే గుర్తించడంలో ఈ టిఫా స్కాన్ ఉపయోగపడుతుంది. స్కానింగ్ చేసి ఏమైనా సమస్యలు ఉంటే వైద్యులు గర్భిణీలకు సూచనలు చేస్తారు. ఈ టిఫా స్కానింగ్ చేయించుకోవాలంటే రూ. 1100 ఖర్చు అవుతుంది. అయితే ఈ ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుంది. అలానే అల్ట్రా సోనోగ్రామ్ స్కానింగ్ కి రూ. 250 చొప్పున ప్రభుత్వం పెట్టుకుంటుంది.
ఆరోగ్య శ్రీ సదుపాయం ఉన్న ఆసుపత్రుల్లో ఈ టిఫా స్కానింగ్ ఉచితంగా నిర్వహిస్తారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబానికి చెందిన గర్భిణీలకు ఒక టిఫా స్కానింగ్, రెండు అల్ట్రా సోనోగ్రామ్ స్కానింగ్ లు ఉచితంగా చేస్తారు. గత ఏడాది ఆరోగ్యశ్రీ కింద 2.31 లక్షల మంది గర్భిణీలు ప్రసవ సేవలు పొందారు. గర్భిణీలకు టిఫా, అల్ట్రా సోనోగ్రామ్ స్కానింగ్ చేయడానికి అవసరమైన విధానాలను ఆన్ లైన్ లో పొందుపరిచినట్లు ఆరోగ్య శ్రీ అధికారులు వెల్లడించారు. ఆన్ లైన్ లో ఎలా నమోదు చేసుకోవాలో నెట్వర్క్ ఆసుపత్రుల మెడికోలు,డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చామని, లబ్దిదారులైన మహిళలు ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ సేవలను వినియోగించుకోవాలని అన్నారు.