తూర్పు గోదావరి జిల్లాలో అక్టోబర్ 2న పవన్ కల్యాణ్ చేయబోయే శ్రమదానానికి అనుమతి నిరాకరించారు అధికారులు. కాటన్ బ్యారేజీపై అక్టోబరు2న జనసేన పార్టీ శ్రమదానం చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏపిలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నందున వాటిని బాగు చేసి నిరసన తెలపాలని ప్రకటించింది. ఈ నేపథ్యంలో జనసేనకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. శ్రమదానా కార్యక్రమానికి ఏపీ జల వనరుల శాఖ అనుమతి నిరాకరించింది.
పవన్ కళ్యాణ్ శ్రమదాన కార్యక్రమం చేపట్టాలనుకున్న కాటన్ బ్యారేజీ ఆర్‌అండ్‌బీ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. కేవలం మానవతా దృక్పథంతో ప్రజల రాకపోకలకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం కలుగుతుందన్న, కాబట్టి అనుమతి కుదరదని జల వనరుల శాఖ తెలిపింది. అయితే.. కావాలనే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని.. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే బ్యారేజీపై రోడ్డు బాగు చేసే కార్యక్రమాన్ని జరిపి తీరుతామని జనసేన పార్టీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ నేతలు, కార్యకర్తలతో మరోసారి భేటీ కానున్నారు. అక్టోబరు 2న చేపట్టాల్సిన రోడ్ల శ్రమదానం కార్యక్రమంపై ఆయన చర్చించనున్నారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడబోరని ప్రత్యేకంగా చెప్పింది.
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని.. రహదారులను మరమ్మతు చేపట్టాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. జనసేన పార్టీ ఈ నెల 2, 3, 4 తేదీల్లో సామాజిక మాధ్యమాలు వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం తెలిసిందే. నాలుగు వారాలు గడిచినా వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏ చర్యలూ తీసుకోలేదు. ఇక ప్రభుత్వం స్పందించని పక్షంలో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక రహదారికి జనసేన శ్రేణులు మరమ్మతులు చేస్తాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి – ధర్మవరం రోడ్డుకు శ్రమదానం ద్వారా మరమ్మతులు చేపట్టాలని కూడా పవన్ నిర్ణయించారు. అక్టోబర్ 2వ తేదీన 10గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై దెబ్బ తిన్న రహదారికి మరమ్మతులు చేసే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ శ్రమదానం చేయతలపెట్టారు. ఈ క్రమంలో ఏపీ జల వనరుల శాఖ అనుమతి నిరాకరించింది. ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఏపీ సర్కారు బ్రేక్ వేసినట్టు కనిపిస్తోంది.
