ఇరుకు సందులు, కిక్కిరిసి ఉండే ప్రదేశాల్లో సభలు, సమావేశాలు నిర్వహించడం వల్ల ఎంత తీవ్ర నష్టం వాటిల్లుతుందో కందుకూరు, గుంటూరు సభల్లో చోటు చేసుకున్న పరిణామాలు అద్దం పడుతున్నాయి. ఇరుకైన ప్రదేశాల్లో బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించడం కారణంగా ఏపీలో రెండు వేర్వురు ఘటనల్లో మొత్తం 11 మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కందుకూరు, గుంటూరు సభల్లో విషాదాల తర్వాత.. రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ.. నిర్ణయం తీసుకుంది. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపై.. అలాగే మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అయితే అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు కచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వొచ్చని మినహాయింపు ఇచ్చింది.
రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలతో ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని.. అలాగే వాటి నిర్వహణలో లోటుపాట్లు, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల.. ప్రజల ప్రాణాల మీదకు వస్తుందని.. అందుకే వాటికి అడ్డుకట్ట వేయడం కోసం.. 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1861 పోలీస్ చట్టం ప్రకారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అలానే రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రోడ్లను కేవలం ప్రజల రాకపోకలు, సరుకు రవాణా కోసమే ఉపయోగించాలని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.
ఉత్తర్వుల నేపథ్యంలో.. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సభల నిర్వహణకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. రోడ్లకు దూరంగా, జనాలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్రాంతాల్లో సభలకు ఎంపిక చేయాలని.. పార్టీలు, సంస్థలు సభలను ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఇటీవల జరిగిన ప్రమాదాలతో రోడ్లపై నియంత్రణ లేకుండా సభలు, ర్యాలీల నిర్వహణ వల్ల జనాలు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వం గుర్తు చేస్తూ.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఇటీవల చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతల అధ్వర్యంలో నిర్వహించిన సభల్లో ప్రమాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కందుకూరు ఘటనలో 8మంది, గుంటూరు తొక్కిసిలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణపై నిషేధం విధించింది. మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.