ప్రముఖ మీడియా అధినేత ఎండీ వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదు చేసింది ఏపీ సీఐడీ సంస్థ. విధులకు ఆటంకం కల్గించారనే అభియోగంపై జిరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీఐడీ పేర్కొంది. ఐపీసీ 353, 341, 186, 120(బీ) సెక్షన్ల కింద కింద రాధాకృష్ణ పై కేసు నమోదు అయ్యింది. సీఐడీ విభాగం రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయ ఎస్సై జీవీవీ సత్యనారాయణ ఫిర్యాదుపై మంగళగిరిలోని సీఐడీ ప్రధాన పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ‘రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధుల దారి మళ్లింపు జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా.. తాజాగా సీఐడీ అధికారులు అప్పటి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ కె.లక్ష్మీ నారాయణ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో వేమూరి రాధాకృష్ణ తమ విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐడీ అధికారులు విజయవాడలోని సీఐడీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే, ఈ కేసులో న్యాయవాది జీవీజీ నాయుడు, ఏబీఎన్ వీడియోగ్రాఫర్ ఎన్.రమేశ్, ఏబీఎన్ రిపోర్టింగ్ ఏజెంట్ సోమపల్లి చక్రవర్తి రాజును నిందితులుగా పేర్కొన్నారు. ఈ నెల 10న ఈ ఘటన జరగ్గా 11న సాయంత్రం ఏడు గంటలకు అందిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్లో వివరించారు.