రాజావారు రాణిగారు, ఎస్ఆర్ కళ్యాణమండపం హిట్లతో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ ఏడాది సెబాస్టియన్ మూవీతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. తాజాగా ‘సమ్మతమే’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. మరి భారీ అంచనాల మధ్య విడుదలైన సమ్మతమే చిత్రం.. ప్రేక్షకులతో సమ్మతమే అనిపించుకుందా లేదా రివ్యూలో చూద్దాం!
కథ:
కృష్ణ (కిరణ్ అబ్బవరం) చిన్నప్పుడే తల్లిని కోల్పోయి.. తండ్రి పాలనలో పెరుగుతాడు. చిన్నప్పటి నుండి తల్లి ప్రేమకు దూరమైన కృష్ణ.. కాబోయే భార్య నుండి ఆ ప్రేమను పొందాలని పెళ్లి కోసం ఆరాటపడుతుంటాడు. తాను ఎవరినైతే పెళ్లి చేసుకుంటాడో.. ఆ అమ్మాయినే ప్రేమించాలని బలంగా నిర్ణయించుకొని.. ఏ అమ్మాయివైపు చూడడు. తనకు కాబోయే భార్య కూడా అలాగే ఉండాలని అనుకుంటాడు. ఇక మొదటిసారి పెళ్లిచూపులకు శాన్వి(చాందిని చౌదరి)ని చూసి ఇష్టపడతాడు. కానీ.. ఆమెకు ఓ లవ్ స్టోరీ ఉందని తెలియడంతో వద్దనుకుంటాడు. కానీ శాన్వికి కృష్ణపై ఇష్టం ఏర్పడుతుంది. ఈ క్రమంలో భిన్న స్వభావాల కారణంగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి. మరి పాతతరం ఆలోచనలు కలిగిన కృష్ణ – మోడరన్ శాన్వి ఎలా ఒక్కటయ్యారు? వారి మధ్య వచ్చే ప్రాబ్లెమ్స్ ఏంటి? చివరికి ఏం సందేశం ఇచ్చారు? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
పెళ్లీడుకు వచ్చిన అబ్బాయిలంతా కాబోయే భార్య విషయంలో ఓ మెనూ క్రియేట్ చేసి పెట్టుకుంటారు. తీరా పెళ్లాయ్యాక అటు కన్నవాళ్లకు, ఇటు కట్టుకున్న భార్యకు మధ్య నలిగిపోతుంటారు. ఈ క్రమంలో భార్యకు కొన్ని ఆంక్షలు విధించి అదే ప్రేమని భావిస్తుంటారు. ఇది అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ. అదే అమ్మాయిల విషయానికి వస్తే.. మెట్టినింట్లో ఆంక్షల వలన అమ్మాయిలు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు? పెళ్లి వరకూ నచ్చినట్లు బ్రతికిన అమ్మాయి.. పెళ్లి తర్వాత భర్తకు నచ్చినట్లు మాత్రమే ఉండాలంటే ఎలా? ఆ అమ్మాయికంటూ సపరేట్ లైఫ్ గోల్స్ ఉంటాయి కదా.. ఇలాంటి సెన్సిబుల్ విషయాలను సమ్మతమే చిత్రంలో డిస్కస్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. స్టోరీ పాయింట్ బాగున్నా.. ఆకట్టుకునే కథనం లోపించడం సినిమాకి మైనస్ అయ్యింది.
ఈ మూవీ అంతా కృష్ణ, శాన్వీల చుట్టే తిరుగుతుంది. సాధారణ లవ్ స్టోరీస్ మాదిరిగానే ఈ సినిమా కూడా సాగుతుంది. అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడతారు. ఈ క్రమంలో వారికి ఏదొక అడ్డంకి ఏర్పడుతుంది.. ఇదంతా ఎన్నో సినిమాల్లో చూశాం. అయితే.. సమ్మతమేలో కృష్ణ – శాన్విలకు ఏర్పడిన సమస్య ఏంటనేది ఆసక్తికరమైన పాయింట్. ఇద్దరి మధ్య కండీషన్స్.. అవమానాలు..చివరకు సారీ చెప్పుకోవడం.. కథంతా ఇలానే సాగుతుంది.
సొంతూరు నుండి హైదరాబాద్ కు వచ్చిన కృష్ణ.. శాన్వీని తనకు నచ్చే విధంగా మార్చాలి అనుకోవడంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ లో కథనం స్లోగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అసలు కృష్ణ క్యారెక్టర్ అంతలా సంఘర్షనకు గురయ్యేంత సీరియస్ విషయం ఏముందనిపిస్తుంది. అదీగాక సినిమాలో స్ట్రాంగ్ ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం మైనస్ అనే చెప్పాలి. ఇలాంటి సినిమాలలో క్లైమాక్స్ ని కొత్తగా ఎక్సపెక్ట్ చేస్తారు. ఆ విషయంలో కూడా సమ్మతమే అంచనాలు అందుకోలేకపోయింది. కానీ.. ఓరల్ గా సినిమాలో దర్శకుడు రైస్ చేసిన పాయింట్ మాత్రం బాగుందనిపిస్తుంది.
ఇక ఎప్పటిలాగే కిరణ్ అబ్బవరం మరోసారి కృష్ణ పాత్రలో ఆకట్టుకున్నాడు. అతని పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. శాన్వీ పాత్రలో చాందిని చౌదరి ఆకట్టుకుంది. మోడ్రన్ ఆలోచనలు కలిగిన అమ్మాయిగా మెప్పించింది. హీరో తండ్రిగా గోపరాజు రమణ డైలాగ్స్ బాగున్నాయి. సప్తగిరి కామెడీ వర్కౌట్ అయి.. కాలేదనిపిస్తుంది. ఇక మిగతా నటీనటులంతా వారి పరిధిమేరకు పరవాలేదనిపించారు. లవ్ స్టోరీస్ లో మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సమ్మతమేలో శేఖర్ చంద్ర మ్యూజిక్ ప్లస్ అయ్యింది. ఆహ్లాదకరమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ బాగుంది. విప్లవ్ నైషధం ఎడిటింగ్ ఓకే. ముఖ్యంగా సెకండాఫ్ లో తన కత్తెరకు పని చెప్పాల్సింది. ఇక సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ లు:
స్టోరీ పాయింట్
కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి
మ్యూజిక్
మైనస్ లు:
రిపీటెడ్ ఎమోషన్స్
స్లో నేరేషన్
పట్టువిడుపుల కథనం
చివరిమాట:
ప్రేక్షకుల సమ్మతి.. పొందడం కష్టమే!
రేటింగ్:
2.25/5