KGF Chapter 2 Review in Telugu: దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురుచూసిన మోస్ట్ అవైటెడ్ చిత్రం.. కేజీఎఫ్ ఛాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా ఈ గురువారం(ఏప్రిల్ 14) విడుదలైంది. కేజీఎఫ్-1తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్‌కు వచ్చిన స్టార్డమ్ చూశాం. అంతేకాదు ఛాప్టర్-2పై ప్రేక్షకుల్లో పెరిగిన అంచనాలు కూడా చూశాం. మొదటి భాగంలో ప్రశాంత్ నీల్ ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా ప్రేక్షకుల్లో ఒక ఉత్సుకతను రేకెత్తించి పంపేశారు. మరి ఆ ప్రశ్నలకు ఈ ఛాప్టర్-2లో సమాధానాలు దొరికాయా? ఇంతటి భారీ అంచనాల నడుమ విడుదలైన కేజీఎఫ్ ఛాప్టర్-2 ప్రేక్షకుల ఎక్స్ పెక్టేషన్ ను అందుకోగలిగిందా? అసలు కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ:
20 వేల మంది కార్మికులు, 2 వేల మంది ప్రైవేట్ సైన్యం మధ్యకు వెళ్లి అతని స్థావరంలోనే గరుడను రాఖీ హత్య చేయడంతో కేజీఎఫ్ సినిమా ముగిసింది. ఆ తర్వాత రాఖీ ఆ సామాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఒక కొత్త సుల్తాన్ గా అవతరించడంతో ఈ ఛాప్టర్-2 మొదలవుతుంది. చనిపోయాడనుకున్న అధీరా(సంజయ్ దత్) తిరిగి రావడంతో రాఖీకి అసలు పోటీ వచ్చినట్లైంది. అధీరా కథలోకి వచ్చిన కాసేపటికే రాఖీ ఒంట్లో బులెట్ దింపి.. ప్రాణ భిక్ష పెడతాడు. అక్కడి నుంచి కథ ఊపందుకుంటుంది. మొత్తం సామ్రాజ్యం ప్రమాదంలో పడుతుంది. పరిస్థితులు చేదాటిపోతాయి. అప్పుడు రాఖీ వాటిని ఎలా చక్కదిద్దాడు.. తన ఆధిపత్యాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది స్క్రీన్ పై చూడాల్సిందే.
పనోడిగా తీసుకొచ్చిన వాడు.. వాళ్ల సింహాసనానికే ఎసరు పెడితే.. ఆ పార్టనర్స్ ఆండ్రూస్, కమల్, గురు పాండియన్, రాజేంద్ర దేశాయ్ ఎందుకు ఊరుకుంటారు? ఊరుకోరు ఎదిరించి నిలబడతారు. ఒక పెద్ద దండయాత్రే చేస్తారు. ఆ క్రమంలో వాళ్లల్లో వాళ్లే కొట్టుకు చస్తారు. అసలు వాళ్లు మొదలు పెట్టిన యుద్ధాన్ని రాఖీ ఎలాగెలిచాడు? అనేది మీరు వెండితెరపై చూడాల్సిందే. 20 వేల మంది కార్మికులను విడుదల చేసిన రాఖీ.. మళ్లీ వాళ్లతో అదే పని ఎందుకు చేయించాడు. సంకెళ్లు విప్పిన చేతితో మళ్లీ వాళ్లను కార్మికులుగా ఎందుకు మార్చాడు అనేది కీలక అంశం. అయితే మొదటి నుంచి రాఖీ నాకు ఈ దునీయా కావాలి అంటాడు. అసలు అతనిలో ఆ కోరిక ఎందుకు పుట్టింది? వాళ్ల అమ్మకు ఇచ్చిన మాట ఏంటి? దేశానికే ఎదురెళ్లాల్సినంత పెద్ద కోరిక ఏంటి? అసలు ఆ కోరిక నెరవేర్చ గలిగాడా? ఒక దేశ ప్రధాని రాఖీభాయ్ అనే రామకృష్ణప్ప బెరియాని ఓడించగలిగారా? అనేదే కథ.
విశ్లేషణ:
ఎంతో బలంగా, కట్టుదిట్టంగా రాసుకున్న కథ, కథనానికి అదే రేంజ్ హీరో దొరికితే ఎలా ఉంటుందో కేజీఎఫ్ ఛాప్టర్-2లో చూడచ్చు. సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు ఎక్కడా ఏ చిన్న లాజిక్ మిస్ కాకుండా, ఏ చిన్న తప్పు దొర్లకుండా ప్రశాంత్ నీల్ ఎంతో జాగ్రత్త తీసుకున్నాడు. సినిమాలో కనిపించే ప్రతి పాత్ర కథకు ప్రాణం పోస్తుంది. స్క్రీన్ పై కనిపించే ప్రతి పాత్రను వందశాతం వాడుకోవడంలో ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడు. హీరోకు మొదటి నుంచి ఏ స్థాయి ఎలివేషన్స్ ఇస్తూ వచ్చాడో అతని ప్రత్యర్థులను కూడా అలాగే చూపించుకుంటూ వచ్చాడు. అధీరాను కూడా రాఖీకి ఏ మాత్రం తగ్గకుండా చూపించాడు. ‘నేను కొట్టిన ప్రతి వాడు డానే’.. అని రాఖీ చెప్పే డైలాగ్‌కు తగ్గట్లుగా అతనికి ఎదురయ్యే ప్రతి వ్యక్తిని అదే స్థాయిలో చూపించాడు.
ఒక వ్యక్తి దేశానికే ఎదురెళ్లడం.. దేశ ప్రధానికే సవాలు విసరడం అనేది ఊహించుకోవడానికి సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఎక్కడా కూడా ఎబ్బెట్టుగా కాకుండా నమ్మసక్యంగానే కథను ముందుకు నడిపించాడు. అసలు వీధుల్లో బూట్ పాలిష్ చేసుకునే బుడ్డాడు.. దేశాన్ని ఎదిరించే స్థాయికి ఎలా ఎదగగలిగాడో చూపించిన తీరు నమ్మేట్టుగానే ఉంటుంది. సినిమాలో ఎలివేషన్స్, యాక్షన్ మాత్రమే కాదు.. సెంటిమెంట్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. హీరో వేసే ప్రతి అడుగు, ప్రతి ఎత్తుగడ నరాలు తెంచే ఉత్కంఠను రేకెత్తిస్తాయి. ఎక్కడా సగటు ప్రేక్షకుడి అంచనాలు తగ్గకుండా.. ఈ సీన్ ఎందుకు ఉంది అనే భావన రాకుండా ఎంతో పక్డబంధీగా తెరకెక్కించారు. 2.48 గంటలపాటు ప్రేక్షకుడిని కుర్చీకి కట్టిపేడయడంలో ప్రశాంత్ నీల్ సఫలీకృతుడయ్యాడు.
నటీనటుల పనితీరు:
రాకింగ్ స్టార్ యష్.. మొదటి పార్ట్ లో కంటే ఈ యాక్షన్ ప్యాక్డ్ సీక్వెన్స్ లో ఎంతో బాగా నటించాడు. సినిమా మొత్తం రాఖీ వన్ మ్యాన్ షోగా చెప్పుకోవచ్చు. ప్రతినాయకుడిగా సంజయ్ దత్ ఎంతగానో మెప్పించాడు. ఒక వైకింగ్ వేషధారణలో సంజయ్ దత్ అందరినీ ఆకట్టుకున్నాడు. అనంత్ నాగ్ కుమారుడిగా పరిచయం అయ్యి.. కథను ముందుకు నడింపించిన ప్రకాశ్ రాజ్ అందరినీ ఆకట్టుకుంటాడు. కథలో ఏ మాత్రం ఇన్‌టెన్‌సిటీ తగ్గకుండా ముందుకు తీసుకెళ్తాడు. దేశ ప్రధానిగా, నిరంకుశ నేతగా రవీనా ఠాండన్ ఆకట్టుకుంది.
ఈశ్వరీరావు ఛాప్టర్ 2లో కొత్తగా పరిచయం అవుతుంది. భావోద్వేగ సన్నివేశాలను ఈశ్వరీరావు మరో ఎత్తుకు తీసుకెళ్తుంది. ఈసారి శ్రీనిధి శెట్టికి మంచి స్క్రీన్ స్పేస్ దొరికింది. ఆమె పాత్రకు న్యాయం చేసింది. సీబీఐ ఛీఫ్ గా రావు రమేశ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. ఎప్పటిలాగానే తన నటనతో మెప్పించాడు. వానరం పాత్రలో అయ్యప్ప శర్మ కథలో కీలక పాత్ర పోషించాడు. ప్రత్యర్థులుగా అవినాష్, అచ్యుత్ కుమార్, విశిష్ట సింహా ఆకట్టుకున్నారు. రాఖీకి చాచాగా సపోర్టింగ్ రోల్ లో హరీశ్ రాయి ఆకట్టుకున్నాడు. స్క్రీన్ పై కనిపించే ప్రతి ఆర్టిస్ట్ తమ పాత్రకు వందశాతం న్యాయం చేశారు.
టెక్నీషియన్స్ పనితీరు:
సినిమా ఎడిటింగ్ విషయంలో ఉజ్వల్ కులకర్ని పనితీరు మెప్పిస్తుంది. ఏ ఫ్రేమ్, సీన్ అయినా ఇది ఎందుకు ఉంది అనే భావన రాదు. ఎంతో జాగ్రత్తగా కథను పరుగులు పెట్టించాడు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని చూపించడంలో భువన్ గౌడ సక్సెస్ అయ్యారు. యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించిన విధానం హాలీవుడ్ సినిమాలను గుర్తు చేస్తుంది. ఇంక బ్యాగ్రౌండ్ స్కోర్ తో రవి బస్రూర్ కు సినిమాకి ప్రాణం పోశాడు. డబ్బింగ్ విషయంలోనూ మొదటి పార్ట్ కంటే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. డైరెక్టర్ గా కంటే ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో మంతి కథకుడిగా నచ్చుతాడు. తాను అనుకున్న కథను ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా చూపించడంలో ప్రశాంత్ నీల్ విజయం సాధించాడు.
ప్లస్ లు:
రాఖీ హీరోయిజం
బ్యాగ్రౌండ్ స్కోర్
యాక్షన్ సీక్వెన్స్
ఎమోషన్స్
సినిమాటోగ్రఫీ
మైనస్ లు:
ప్రథమార్థంతో పోల్చుకుంటే ద్వితీయార్థంలో అక్కడక్కడా కథ నెమ్మదించడం.
చివరి మాట: రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్..
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.