విశ్వక్ సేన్ అంటే ఒక కంటెంట్ లో దమ్ము ఉంటుందన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. యంగ్ బ్లడ్, మాస్ ఎలిమెంట్స్, వీటికి తోడు విభిన్నమైన కథలు పట్టుకుని వస్తున్నాడు. ఇండస్ట్రీలో నిలబడిపోయాడు. విశ్వక్ సేన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రత్యేకించి ఆయనలో ఉన్న దర్శకుడికి, కథకుడికి అభిమానులు ఉన్నారు. నాలుగేళ్ల ఫలక్ నుమా దాస్ సినిమాతో ఊర మాస్ యాటిట్యూడ్ ని చూపించిన విశ్వక్ సేన్ ఆ తర్వాత క్లాస్ జోనర్స్ ని టచ్ చేస్తూ సినిమాలు చేశారు. హిట్ సినిమాలో పోలీస్ గా సీరియస్ పాత్రలో నటించినా, ఆ తర్వాత అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరిదేవుడా వంటి లవ్ క్లాస్ చిత్రాల్లో నటించారు. ఆ సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన విశ్వక్.. ఇప్పుడు దాస్ కా ధమ్కీ అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ తో మన ముందుకు వచ్చారు. ఉగాది సందర్భంగా విడుదలైన ఈ సినిమా విశ్వక్ కి హిట్ ఇచ్చిందా? కొత్త సంవత్సరం విశ్వక్ సేన్ కి ఇచ్చింది? సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.
కృష్ణదాస్ (విశ్వక్ సేన్ 1) ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో వెయిటర్ గా పని చేస్తుంటాడు. కృష్ణదాస్ కి ఆది (హైపర్ ఆది), మహేష్ (రంగస్థలం మహేష్) తప్ప ఎవరూ ఉండరు. అనాథ అయిన కృష్ణదాస్.. ఆది, మహేష్ లనే తన అమ్మ, నాన్న అని ఫీలవుతుంటాడు. హోటల్ లో వెయిటర్ గా అవమానాలు ఎదుర్కుంటాడు కృష్ణదాస్. కస్టమర్లు అవమానిస్తుంటారు. వెయిటర్ గా కాకుండా అదే హోటల్ కి కస్టమర్ లా వెళ్లాలని అనుకుంటారు. అందుకోసం సూటు, బూటు వేసుకుని రిచ్ పర్సన్ లా ముస్తాబై కృష్ణదాస్, అతని స్నేహితులిద్దరూ హోటల్ కి వెళ్లారు. అదే సమయంలో కృష్ణదాస్ కి కీర్తి (నివేదా పేతురాజ్) పరిచయమవుతుంది. కృష్ణదాస్ ఒక ధనవంతుడిలానే తనను తాను పరిచయం చేసుకుంటాడు. అక్కడ బాగా తాగి ఇద్దరూ హోటల్ రూమ్ లోకి వెళ్తారు. కృష్ణదాస్ మంచోడు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకోడు. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది.
ఒక సందర్భంలో విశ్వక్ సేన్ తనది కాని కారులో కీర్తిని ఎక్కించుకుని బయటకు తీసుకెళ్తాడు. అప్పుడు కీర్తి కారులో ఉన్న విజిటింగ్ కార్డులో ఉన్న డాక్టర్ సంజయ్ రుద్ర (విశ్వక్ సేన్ 2) పేరు చూసి నువ్వు ఫార్మా కంపెనీ సీఈఓ కదా అని అంటుంది. కృష్ణదాస్ తాను కాదని తెలిసినా ప్రేమ చెడిపోకుండా ఉండడం కోసం అబద్ధం చెప్తాడు. సంజయ్ రుద్ర లేని సమయంలో డాక్టర్ ఇంటికి తీసుకెళ్లి తన ఇల్లే అని బిల్డప్ ఇస్తాడు. ఆ తర్వాత కృష్ణదాస్ సీఈఓ కాదని తెలిసి వదిలేసి వెళ్ళిపోతుంది. అదే సమయంలో కృష్ణదాస్, అతని స్నేహితుల ఉద్యోగం పోయి రోడ్డున పడతారు. రెంట్ కట్టలేదని ఇంటి ఓనర్ సామాన్లు బయటపడేస్తాడు. ఇక చాప్టర్ ముగిసిపోయింది అనుకున్న సమయంలో ట్విస్ట్ ఎంటర్ అవుతుంది. రావు రమేష్ కేరెక్టర్ కృష్ణదాస్ ని.. కీర్తితో తన ఇల్లు అని అబద్ధం చెప్పిన ఇంటికి తీసుకెళ్తాడు. కారు యాక్సిడెంట్ లో చనిపోయిన సంజయ్ రుద్రగా ఉండమని రావు రమేష్ అడుగుతాడు. దరిద్రంలో ఉన్న కృష్ణదాస్ వేరే ఆప్షన్ లేక దొరికిందే మంచి అవకాశం అని అందుకు ఒప్పుకుంటాడు.
ఇదే ఇంటర్వెల్ ట్విస్ట్ అనుకుంటే.. సంజయ్ రుద్ర తన వల్లే చనిపోయాడని కృష్ణదాస్ ఫీలవ్వడం మరొక ట్విస్ట్. తన వల్ల మంచి డాక్టర్ చనిపోయాడా అని గిల్టీగా ఫీలవుతాడు. ఈ ట్విస్ట్ లు చాలవన్నట్టు సంజయ్ రుద్ర చావలేదని ఇంకో ట్విస్ట్ పెట్టేశారు. ఇంటర్వెల్ కి మూడు ట్విస్ట్ లు ఇచ్చి కథను కీలక మలుపు తిప్పారు. సెకండాఫ్ లో తెలుస్తుంది సంజయ్ రుద్ర అసలు స్వరూపం. సంజయ్ రుద్రనే ఈ కథలో మెయిన్ విలన్ అని తెలుస్తుంది. అప్పటివరకూ తనతో ట్రావెల్ చేసిన వారందరూ విలన్లే అని మరొక ట్విస్ట్ ఇస్తారు. కృష్ణదాస్ ను 10 వేల కోట్ల స్కామ్ లో ఇరికించేస్తారు సంజయ్ రుద్ర అండ్ టీమ్. సంజయ్ రుద్ర చేసిన స్కాం ఏంటి? ఈ స్కాం నుంచి కృష్ణదాస్ ఎలా బయటపడ్డాడు? మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన కృష్ణదాస్ సంజయ్ రుద్రకు ధమ్కీ ఎలా ఇచ్చాడు అనేది మిగిలిన కథ.
కథ, కథనం విషయానికొస్తే ట్విస్ట్ లకు కొదవ లేదు. యాక్షన్ ఎలిమెంట్స్ కి ఢోకా లేదు. కామెడీ ఫుల్లు. నవ్వుకున్నవాళ్ళకి నవ్వుకున్నంత హాస్యం పండించారు హైపర్ ఆది, మహేష్. ముఖ్యంగా హైపర్ ఆది పంచులు కడుపుబ్బా నవ్విస్తాయి. డైలాగులు చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్టులు, పాత్రల యొక్క అసలు స్వరూపాలు బయటపడడం వంటివి థ్రిల్లింగ్ కి గురి చేస్తాయి. నివేదా, విశ్వక్ సేన్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. వీరి మధ్య వచ్చే రొమాంటిక్ లవ్ ట్రాక్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. మామూలుగా తన పనేదో తాను చూసుకుని సర్దుకుపోయే మధ్యతరగతి వాడ్ని గెలికితే మామూలుగా ఉండదు అని ఈ సినిమాలో కృష్ణదాస్ విలన్స్ కి ఇచ్చిన ధమ్కీ ఓ రేంజ్ లో ఉంటుంది. క్లైమాక్స్ లో ఏ హోటల్ నుంచి అయితే ఉద్యోగం లోంచి గెంటివేయబడ్డాడో అదే ఫైవ్ స్టార్ హోటల్ ని కొనేసి ఓనర్ గా వెళ్తాడు కృష్ణదాస్. అక్కడ ప్రతి ఒక్కరూ క్లాప్స్ కొడతారు.
తనను ఫుట్ పాత్ నా కొడకా అని తిట్టిన చోటే బాస్ గా ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ ప్రతీ మిడిల్ క్లాస్ పర్సన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అవమానం పొందిన చోటే అభిమానం పొందడం అనేది ఎన్ని కోట్లిచ్చినా కొనలేరు. ఇక ఫస్ట్ హాఫ్ కామెడీ, ట్విస్టులు, హీరో, హీరోయిన్ రొమాన్స్, యాక్షన్ ఎపిసోడ్ ఫుల్ ప్యాక్ అనుకుంటే.. సెకండాఫ్ దానికి డబుల్ ఉంటుంది. పదివేల కోట్ల స్కాంలో అమాయకుడైన తనను ఇరికించారని తెలుసుకున్న కృష్ణదాస్.. పోలీసుల నుంచి తనను తాను ఎలా కాపాడుకున్నాడు. సంజయ్ రుద్ర, రావు రమేష్ గ్యాంగ్ ని పోలీసులకు ఎలా అప్పగించాడు? అనే ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. మొత్తానికి కృష్ణదాస్, సంజయ్ రుద్ర నుంచి తనను తాను కాపాడుకుని జైలుకు పంపించాడు అనుకుని ఊపిరి పీల్చుకుంటే.. ఆ సంజయ్ జైలు నుంచి బయటకు వస్తాడు.
కథ అయిపోలేదు, ఇంకా ఉంది అని మరో ట్విస్ట్ ఇచ్చారు. సినిమా చెప్పడానికి సింపుల్ గా ఉన్నా.. విశ్వక్ సేన్ తెరకెక్కించిన విధానం బాగా ఆకట్టుకుంటుంది. ప్రసన్న కుమార్ కథ, విశ్వక్ సేన్ కథనం, మాటలు, దర్శకత్వం బాగుంది. లాజిక్ మిస్ చేశారు అని తప్పుబట్టుకునే అవకాశం ఇవ్వకుండా కథ బాగా రాసుకున్నారు. ఈ సినిమా కూడా అన్ని సినిమాల్లానే రెగ్యులర్ గా ఉంటుందేమో అని ఊహించేలోపే సన్నివేశాలు మారిపోతుంటాయి. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. మాస్ ప్రేక్షకులకు మాస్ ట్రీట్ ఇచ్చిపడేశారు. ఉగాది పచ్చడిలా ఈ సినిమా కూడా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఉంటుంది. ఈ శోభకృత్ నామ కొత్త సంవత్సరాన విశ్వక్ సేన్ ఘన విజయాన్ని అందుకున్నారు.
లియోన్ జేమ్స్ సంగీతం సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. నేపథ్య సంగీతం సినిమాని అలా పైన నిలబెట్టింది. దినేష్ కె బాబు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సన్నివేశాలను చాలా రిచ్ గా చూపించారు. ఆల్మోస్ట్ పడిపోయిందే పాట చిత్రీకరణ బాగుంది. అన్వర్ అలీ ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. విశ్వక్ సేన్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
మొదటిసారిగా విశ్వక్ సినీ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. మధ్యతరగతి వ్యక్తిగా, రిచ్ విలన్ గా రెండు పాత్రల్లో వేరియేషన్స్ చూపిస్తూ చాలా బాగా నటించారు. సంజయ్ రుద్ర పాత్ర అయితే సైకోనే. ఇక నెగిటివ్ రోల్ చేసిన నివేదా పేతురాజ్ గ్లామర్ సినిమాకి ప్లస్ పాయింట్. వీరిద్దరి మధ్య వచ్చే ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల పాట మాత్రం థియేటర్ లో ఓ రేంజ్ లో ఉంటుంది. రావు రమేష్, అజయ్, అతిథి పాత్రలో చేసిన తరుణ్ భాస్కర్, హైపర్ ఆది, మహేష్ లు చాలా బాగా నటించారు.
చివరి మాట: దాస్ కా ధమ్కీ.. ఇది మిడిల్ క్లాస్ కా ధమ్కీ.. అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది.
రేటింగ్: 3/5