తన వైపు నుంచి సమాజాన్ని ఆలోచింపజేసే సినిమాలతో ఆకట్టుకోవాలనే తపనలో భాగంగా నటుడు, కమెడియన్ అలీ చేసిన మరో ప్రయత్నమే ఈ ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ సినిమా. గతంలో లాయర్ విశ్వనాథ్ అనే సినిమాతో అలరించిన అలీ.. ఈసారి వినూత్నమైన కథతో మన ముందుకు వచ్చారు. ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు అలీ. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అలీ, మౌర్యానీ, నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ మూవీ ఆహా ఓటీటీ వేదికగా ఇవాళ (అక్టోబర్ 28న) విడుదల అయ్యింది. మరి నటుడిగా, నిర్మాతగా అలీకి ఈ సినిమా ఎంత వరకూ కలిసి వచ్చిందో, సినిమా ఎలా ఉందో అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ: శ్రీనివాసరావు (నరేష్), సునీత (పవిత్ర లోకేష్) అతి సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన జంట. మూగ, చెవిటి వ్యక్తి అయిన శ్రీనివాసరావు ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు. ఇక సమీర్ (అలీ) ఆర్థిక సమస్యల కారణంగా దుబాయ్ వెళ్లిపోతాడు. కొన్నాళ్ళకి హైదరాబాద్ తిరిగి వస్తాడు. అయితే వస్తూ వస్తూ సోషల్ మీడియా పిచ్చిని తనతో పాటు తెచ్చుకుంటాడు. ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి ఆనందం పొందుతుంటాడు సమీర్. ఒకరోజు శ్రీనివాస్ రైలులో నిద్రిస్తున్న సమయంలో.. దాన్ని సమీర్ ఫోటో తీసి “ఇతనో తాగుబోతు’ అని ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు.
అది కాస్తా వైరల్ అయ్యి శ్రీనివాసరావు కుటుంబాన్ని చిక్కుల్లో పడేస్తుంది. ఈ ఘటనతో శ్రీనివాసరావు జీవితం అస్తవ్యస్తమవుతుంది. ఆ ఫోటో వల్ల శ్రీనివాసరావు జీవితంలో ఎదురైన పరిణామాలు ఏంటి? శ్రీనివాసరావు ఈ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు? తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు? అసలు సమీర్, శ్రీనివాసరావు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? సమీర్ దుబాయ్ నుంచి ఎందుకు తిరిగి వచ్చాడు? సమీర్ తన తప్పు తెలుసుకుంటాడా? లేదా? అనేది మిగిలిన కథ.
మలయాళ మాతృక వికృతి సినిమాకి రీమేక్ గా వచ్చింది ఈ సినిమా. ప్రస్తుత సమాజంలో సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. కొందరు ఐతే సోషల్ మీడియాలో ఇతరుల ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి ఫేమస్ అవ్వాలనుకుంటారు. ఈ క్రమంలో ఇతరుల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఈ పాయింట్ ని పట్టుకుని సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చారు. రీమేక్ ని చెడగొట్టారు అన్న ప్రస్తావన లేకుండా బాగా తెరకెక్కించారు దర్శకుడు కిరణ్ శ్రీపురం. అయితే రన్ టైం ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అలీ, పవిత్ర లోకేష్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. నరేష్ దివ్యాంగుడి పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. నిర్మాతగా అలీ అభిరుచి ఏంటో అందరికీ తెలిసింది. సమాజానికి మేలు చేసే కాన్సెప్ట్ లతో అలరించాలన్న అలీ నిర్ణయం ప్రశంసనీయం. నిర్మాతగా ఒక మెట్టు ఎక్కారు. అయితే కేవలం హాస్యం మాత్రమే కాకుండా.. బాగా సీరియస్ నెస్ ఉండే నేపథ్యం ఉన్న కథలపై ఫోకస్ చేస్తే నిర్మాతగా సక్సెస్ అవుతారు.
రీమేక్ సినిమాని మన నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కించడంలో దర్శకుడు కిరణ్ శ్రీపురం సక్సెస్ అయ్యారు. అయితే కొన్ని సీన్స్ లో సహజత్వం మిస్ అయినట్లు కనిపిస్తుంది. ప్రేక్షకులు ఓన్ చేసుకునేలా కొన్ని సీన్స్ ఉండవు. పైగా కొన్ని ల్యాగ్ సీన్స్ విసుగు తెప్పించేలా ఉంటాయి. కామెడీ సీన్స్ కంటే ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉంటే సినిమా సీరియస్ గా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేదేమో. ఈ ఒక్క విషయం దర్శకుడు ఆలోచించి ఉంటే తన కెరీర్ కి ఉపయోగపడేది. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.