మీ వద్ద ఇంకా 2 వేల రూపాయల నోట్లు మిగిలున్నాయా...ఏం చేయాలో తెలియడం లేదా...ఇప్పటికీ ప్రజల వద్ద 6 వేల కోట్లు 2 వేల నోట్ల రూపంలో ఉన్నాయి. ఆ డబ్బులు ఏమైనట్టు..ఎవరి వద్ద ఉన్నాయి. ఇప్పుడు మార్చుకునేందుకు వీలుందా లేదా..ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం..
డీ మోనిటైజేషన్ తరువాత ప్రవేశపెట్టిన 2 వేల రూపాయల నోట్లను ఆర్బీఐ 2023 మే 19వ తేదీన ఉపసంహరించుకుంది. దేశ ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకున్నారు. అలా మార్కెట్‌లో చలామణీలో ఉన్న నోట్లలో 98.31 శాతం నోట్లు తిరిగి వచ్చేశాయి. 2 వేల రూపాయల నోట్లు ఉపసంహరించే సమయంలో ప్రజల వద్ద 3.56 లక్షల కోట్లు ఉంటే దాదాపు 98 శాతం తిరిగి వచ్చేశాయి. ఇంకా 6017 కోట్లు మిగిలే ఉన్నాయి. మరి ఈ నోట్ల పరిస్థితి ఏంటి, ఇప్పుడు మార్చుకునేందుకు వీలుందా లేదా..ఒకవేళ ఉంటే ఎక్కడ ఎలా మార్చుకోవాలనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది.
మీ వద్ద ఇప్పటికీ 2 వేల రూపాయల నోట్లు మిగిలుంటే ఇప్పటికీ మార్చుకోవచ్చంటోంది. గత ఏడాది అక్టోబర్ 9 వరకైతే నేరుగా బ్యాంకుల్లో మార్చుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం లేదు. నేరుగా ఆర్బీఐకు చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లోనే 2 వేల రూపాయల నోట్లు మార్చుకోవచ్చు.
2 వేల రూపాయల నోట్లు ఎక్కడ మార్చుకోవచ్చు
అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, చెన్నై, గువహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూ ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు. మీ వద్ద మిగిలి ఉన్న 2 వేల రూపాయల నోట్లు జమ చేస్తే ఆ నగదు మీ బ్యాంక్ ఎక్కౌంట్లలో బదిలీ అవుతుంది. లేదా మీకు దగ్గరలోని పోస్టాఫీసు కేంద్రం ద్వారా ఈ డబ్బులు ఆర్బీఐ కేంద్రాలకు పంపించి మార్చుకోవచ్చు. దీనికోసం ఓ ఫారమ్ పూరించి ఇవ్వాలి. ఆధార్ లేదా ఇతర ఐడీ సమర్పించాల్సి ఉంటుంది.
2000 నోట్లను ఎందుకు విత్ డ్రా చేశారు
క్లీన్ నోట్ పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాతవి లేదా వాడుక తగ్గిన లేదా అవసరం తగ్గిన నోట్లను క్రమంగా చెలామణీలోంచి తొలగించడం ఓ ప్రక్రియ. 2016 డీ మోనిటైజేషన్ సమయంలో 500, 1000 నోట్లు రద్దు చేసి కొత్త 500, 2 వేల రూపాయల నోట్లు తీసుకొచ్చారు. ఆ తరువాత 2023లో తిరిగి 2 వేల నోట్లు ఉపసంహరించుకుంది. అలా ప్రజల నుంచి తిరిగి ఆర్బీఐకు 98 శాతం నోట్లు వచ్చేసినా ఇంకా 6 వేల కోట్లు మిగిలిపోయాయి. ఈ నోట్లు ఎవరి వద్ద ఉన్నాయి, ఎందుకు మార్చుకోలేదు, ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, అసలున్నాయా లేవా అనే ప్రశ్నలకు సమాధానం లేదు.