బాలకృష్ణ సినిమా ‘‘ చెన్నకేశవరెడ్డి’’లో క్లైమాక్స్ సీన్ ఒకటి ఉంటుంది. అందులో పెద్ద బాలకృష్ణను పట్టుకోవటానికి పిల్ల బాలకృష్ణ హెలికాఫ్టర్‌లతో రంగంలోకి దిగుతాడు. అప్పుడు పెద్ద బాలకృష్ణ ‘‘ నన్ను పట్టుకోవటానికి కావాల్సింది ఖర్చు కాదురా.. ఖలేజా.. అదెలా ఉంటుందో చూపిస్తాను.. చూడు.. సత్తిరెడ్డి’’ అంటాడు. అప్పుడు భూమి బద్ధలు కొట్టుకుని కార్లు గాల్లోకి పైకి లేస్తాయి. ఈ సినిమాకు ఈ సీన్ హైలెట్‌గా నిలుస్తుంది. ఏదైనా కారు గాల్లోకి పైకి లేచినపుడు జనం ‘‘ చెన్నకేశవరెడ్డి’’ సినిమాలో లేచినట్లుగా.. కారు గాల్లోకి లేచిందిరా అనటం పరిపాటి.
ఇక, కారు గాల్లోకి లేచిన ప్రతీ సంఘటనను ఈ సీన్‌తో పోలుస్తుంటారు జనాలు. తాజాగా, సినిమాలో కార్లు పైకి ఎగిరినట్లు ఓ కారు గాల్లోకి ఎగిరింది. టోల్ గేట్ డివైడర్‌ను ఢీకొట్టి అది గాల్లోకి లేచింది. అంతాఇంతా కాదు.. ఏకంగా 50 అడుగులు పైకి లేచింది. ఈ సంఘటన చైనాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ చైనా, షెంగ్‌యాంగ్-డాలియాన్ ఎక్స్‌ప్రెస్ వేపై కొద్దిరోజుల క్రితం ఓ కారు వేగంగా దూసుకెళుతోంది. మరి తాగి ఉన్నాడో ఏమో తెలీదు కానీ, వాయువేగంతో కారును నడుపుతున్నాడు. ఆ కారు అంతే వేగంతో షిహే టోల్ స్టేషన్ వద్దకు వచ్చింది.
కారు ఎటువెళుతోంది.. ఏం జరుగుతోంది అని కూడా ఆ డ్రైవర్ చూసుకోలేదు. టోల్ ఎంట్రన్స్‌లో ఉండే డివైడర్‌ను అతి వేగంతో ఢీకొట్టాడు. అంతే! ఆ కారు అంతేవేగంతో సర్రున గాల్లోకి లేచింది. ఆ లేవటం కూడా దాదాపు 50 అడుగుల ఎత్తుపైకి లేచి, ఢామ్ అని కిందపడింది. ఇక్కడ అదృష్టకరమైన వార్త ఏంటంటే.. అందులోని వ్యక్తికి ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. కేవలం గాయాలతో మాత్రమే బయటపడ్డాడు. టోల్ గేట్ సిబ్బంది అతడ్ని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఇక, దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.