అప్పుడప్పుడు ఆకాశంలో వింత ఆకారాలు ఎగురుతూ కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసిన జనం అవేంటో అర్థంకాక, కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకుని భయపడిపోతూ ఉంటారు. ముఖ్యంగా వాటిని గ్రహాంతర వాసులకు సంబంధించిన వస్తువులుగా భ్రమపడిపోతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. చివరకు అవి ఏలియన్‌లు కావు.. వింత వస్తువులు అసలే కాదు అని తెలిసినపుడు ప్రజలు తమ అమాయకత్వానికి సిగ్గుపడిపోతుంటారు. తాజాగా, ఇలాంటి ఓ సంఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. ఈ ఉదయం వికారాబాద్ శివారు ప్రాంతంలోని ఆకాశంలో కనిపించిన ఓ వింత ఆకారం జనాన్ని హడలెత్తించింది.
దాన్ని చూసిన జనం అదో ఏలియన్ షిప్ అని భ్రమపడ్డారు. ఆ వింత ఆకారం అలా గాల్లో ఊగుతూ ఎగురుతూ ముందుకు సాగిపోయింది. అల్లంత దూరంలో ఆకాశంలో ఎగురుతున్న అది మొగిలిగుండ్లలోని పంటపొలాల్లో కుప్పకూలింది. వివరాల్లోకి వెళితే.. ఈ ఉదయం వికారాబాద్ శివారు ప్రాంతంలోని ఆకాశంలో ఓ వింత ఆకారం ఎగురుతూ కనిపించింది. దాన్ని చూడగానే జనం భయపడిపోయారు. దాన్నో ఏలియన్ వాహనంలాగా భావించారు. ఆ వింత ఆకారం ఎగురుతూ మొగిలిగుండ్లలోని పొలాల్లో పడిపోయింది. దాన్ని చూడటానికి జనం ఎగబడ్డారు. అది బెలూన్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
అది ఒక రీసెర్చ్ బెలూన్ అని శాస్త్రవేత్తలు తేల్చారు. హైదరాబాద్‌లోని నేషనల్ బెలూన్ ఫెసిలిటీ అనే సంస్థకు చెందినదిగా తెలియవచ్చింది. దీనిపై ప్లానటరీ సొసైటీ డైరెక్టర్ రఘునందన్ మాట్లాడుతూ.. ‘‘ సాధారణంగా వాతావరణాన్ని పరిశోధించడానికి ఇలాంటి బెలూన్స్‌ను పంపుతూ ఉంటారు. ఇదొక హీలియం బెలూన్. దానికి దాదాపు 1000 కిలోల బరువున్న పరికరాలను శాస్త్రవేత్తలు అమర్చారు. పరిశోధనల కోసం గాల్లోకి వదిలారు. గత నెలలోనే దీని గురించి ఓ ప్రకటన చేశారు. రీసెర్చ్ బెలూన్‌ను ఆకాశంలోకి పంపుతున్నామని వారు హెచ్చరించారు. ఇది 40 కిలోమీటర్లు గాల్లోకి వెళ్లిన తర్వాత రకరకలా పరిశోధనలు చేస్తుంది. మళ్లీ నేలపైకి దిగి వస్తుంది. చాలా విలువైన సమాచారాన్ని అందిస్తుంది’’ అని తెలిపారు.