సాధారణంగా ఎవరైన.. తాము ఆర్డర్ చేసిన వస్తువు సమయానికి రాకపోతే అసహనం వ్యక్తం చేస్తారు. ఇంకా ఆలస్యం ఎక్కువ అయితే డెలివరీ చేసే వ్యక్తిపై అగ్గిమీద గుగ్గిలం అయిపోతారు. అయితే కొన్ని సందర్భాల్లో డెలివరీ బాయ్ ఆలస్యంగా రావడానికి గల కారణం తెలిస్తే.. కోపం కంటే అయ్యో పాపం అనే భావన వస్తుంది. అచ్చాం అలాంటి భావనే రోహిత్ అనే వ్యక్తి కి కలిగింది. తాను ఫుడ్ ఆర్డర్ పెడితే ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా అంటూ ఫుడ్ డెలివరీ బాయ్ అరగంటకుపై ఆలస్యం చేశాడు. దీంతో డెలివరీ బాయ్ వస్తే.. ఓరేంజ్ లో క్లాస్ పీకడానికి రోహిత్ సిద్దమయ్యాడు. అయితే ఆలస్యంగా వచ్చిన డెలివరీ బాయ్ చూసి తిట్టడం కాదు కదా.. ఆ వ్యక్తినే క్షమించమని వేడుకున్నాడు. అసలు రోహిత్ అలా ప్రవర్తించాడానికి గల కారణం ఏమిటి? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కర్నాటకలోని బెంగళూరులో నివాసం ఉంటున్న రోహిత్ కుమార్ సింగ్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఓ రోజు వంట చేసుకునే ఓపికలేక బాగా ఆకలి వేస్తుండటంతో ఓ డెలివరీ సంస్థ యాప్ లో ఫుడ్ ను ఆర్డర్ చేశాడు. అయితే ఫుడ్ డెలివరీ ఆలస్యం అయింది. దీంతో రోహిత్ డెలివరీ బాయ్ కు ఫోన్ చేశాడు. సార్.. ఐదు నిమిషాల్లో మీకు డెలివరీ చేస్తా అని చెప్పాడు.. అయితే అరగంట అయినా ఫుడ్ ని ఆ వ్యక్తి తీసుకుని రాలేదు. తనకు ఫుడ్ ని ఆలస్యంగా తీసుకొచ్చిన ఆ డెలివరీ బాయ్ మీద రోహిత్ కి కోపం వచ్చింది. డెలివరీ బాయ్ ని ఓ రేంజ్ లో తిట్టాలని కోపంతో డోర్ తీశాడు రోహిత్.. అంతే తనకు ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తిని చూసి షాకయ్యాడు. ఫుడ్ డెలివరీ చేసివ వ్యక్తి.. ఊతకర్రల సాయంతో వచ్చి నిల్చున్నాడు.
ఆయన వయస్సు సుమారు 40 ఏళ్లు ఉంటుంది. ఊతకర్రల సాయంతో నిల్చుని.. చేతిలో ఫుడ్ కవర్ ని డెలివరీ ఇవ్వడానికి రెడీ అవుతూ.. చిరునవ్వుతో గుమ్మం ముందు నిల్చున్నాడు. డెలివరీ బాయ్ విషయం తెలియక ఫోన్ లో విసిగించినందుకు రోహిత్ క్షమాణలు చెప్పాడు. అనంతరం ఆ వ్యక్తి గురించి రోహిత్ తెలుసుకున్నాడు. ఆ డెలివరీ బాయ్ పేరు కృష్ణప్ప రాథోడ్. కరోనా రాకముందు వరకూ ఒక కెఫేలో పనిచేసేవారు. అయితే కరోనా సమయంలో ఉద్యోగాన్ని కోల్పోయాడు. కుటుంబ పోషణ కోసం కృష్ణప్ప స్వీగ్గి డెలివరీ బాయ్ మారినట్లు చెప్పాడు. కుటుంబం అంతా సిటీలో ఉంటే కష్టమని.. అందుకే వారందరిని పల్లెటూరిలో ఉంచినట్లు కృష్ణప్ప తెలిపారు.
తనకు మరో డెలివరీ ఉందంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. హృదయవిదారకమైన కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ఈ పోస్టు పై స్పందిస్తున్నారు. ప్రతి చిన్న సమస్యకు, కుంగిపోవడం, చికాకుపడే వాళ్లు.. కృష్ణప్పను స్ఫూర్తిగా తీసుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కృష్ణప్ప ఆత్మవిశ్వాసంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఎవరైనా కృష్ణప్పకు సాయం చేయాలనుకుంటే తనకు మెసేజ్ చేయాలని రోహిత్ పేర్కొన్నాడు. మరి..కృష్ణప్ప లైఫ్ స్టోరీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.