ఉమ్మడి ఆంధ్రప్రదదేశ్ మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె.. వైఎస్ షర్మిల రాజకీయాల్లో చాలా చురుగ్గా రాణిస్తున్నారు. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పార్టీ పెట్టి.. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ప్రజాప్రస్థానం పేరిటి మహా పాదయాత్రను చేపట్టారు. అయితే వరంగల్, నర్సిపట్నంలో పాదయాత్ర సాగుతుండగా.. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీఆర్‌ఎస్ కార్యకర్తలు కొందరు షర్మిల పాదయాత్రపై దాడి చేయడమే కాక.. బస్సును తగలబెట్టారు. దీంతో గత రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడి నేపథ్యంలో షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. అద్దాలు పగిలిన కారును స్వయంగా నడుపుకుంటూ.. ప్రగతి భవన్‌కు చేరుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఆమెను మధ్యలో అడ్డుకుని.. కారుతో సహా ఆమెను తరలించారు.
అనంతరం ఈ సంఘటనకు సంబంధించి.. పోలీసులు షర్మిలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత న్యాయస్థానం షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది. అలాగే పాదయాత్రకు కూడా షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అనంతరం షర్మిల పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని తల్చుకుని కన్నీరు పెట్టుకున్నారు.
షర్మిల మాట్లాడుతూ.. ‘‘నేనంటే నాన్నకు ప్రాణం. నాన్నంటే నాకు అంతే ఇష్టం. అసలు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి బతికి ఉండి ఉంటే.. కోట్ల మంది ప్రజల బతుకులు బాగుపడేవి. ఆ విషయం తల్చుకున్నప్పుడల్లా ఎంతో బాధగా అనిపిస్తుంది. నాన్న ఇంకా కొంత కాలం బతికి ఉన్నా కూడా.. ఎంతోమంది జీవితాలు మారిపోయేవి. ప్రస్తుతం ప్రతి దాంట్లో లోటు ఉంది. అది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు ఆయన బతికుంటే ఇలా జరుగుండేదికాదు. అసలు ఎంత గొప్ప మనసు.. ఎంత పెద్ద మనిషి. అలాంటి రాజశేఖర్ రెడ్డి పాలన తెలంగాణ ప్రజలకు మళ్లీ అందించాలని సంకల్పించా. ఇంత మంది ప్రేమించారు. ఇంత మంది చనిపోయారు. వీళ్లకోసం మనం ఇది చేయలేమా అంటూ.. నా గుండెల మీద నాన్న ఒక విల్లు రాసినట్టు అనిపించింది’’ అంటూ తండ్రిని గుర్తు చేసుకుని.. వైఎస్ షర్మిల కంటతడిపెట్టుకున్నారు.