తెలంగాణ లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఎక్కడా ఏవిధమైన ప్రమాదకరమైన ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గత వారం రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్ మెంట్ తెలిపింది. దీనిని దృష్టిలో పెట్టుకుని టీఎస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వర్షాల కారణంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాల భారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరింది.