గత కొంత కాలంగా దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందకు ట్రాఫిక్ నియమాలు కఠినతరంగా మార్చారు. అయితే కొన్నిసార్లు ట్రాఫిక్ పోలీసులు పెట్టే ఆంక్షల వల్ల పలువురు ఇబ్బందులు పడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా యాదాద్రి జిల్లా ట్రాఫిక్ పోలీస్ సింబ్బంది చూపించిన అత్యుత్సాహం వల్ల ఓ చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక చిన్నారికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో కారు లో తీసుకు వెళ్తుండగా అప్పటికే వాహనంపై రూ.1000 చలాన పెండింగ్ ఉందని అది ఖచ్చితంగా చెల్లించాలని చెప్పడంతో గొడవ జరగడం వల్ల సమయానికి ఆస్పత్రికి తీసుకోని వెళ్లలేకపోవడం వల్ల పాప మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..
జనగాం జిల్లాకు చెందిన మల్లేశం, సరస్వతికి మూడు నెలల క్రితం ఒక బాబు జన్మించాడు. ఈ మద్య ఆ బాబు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో జనగాంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చూపించారు. బాబు పరిస్థితి చాలా విషమంగా ఉందని.. వెంటనే హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తీసుకు వెళ్లడం మంచిదని డాక్టర్లు చెప్పడంతో ఒక కారు అద్దెకు తీసుకొని బయలుదేరారు మల్లేశం దంపతులు. వంగపల్లి వద్దకు రాగానే వాహనాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది ఆ కారును ఆపారు. ఆ కారుపై గతంలో ట్రాఫిక్ ఉల్లంఘన పై వెయ్యి రూపాయలు చలానా పెండింగ్ ఉందని.. అది చెల్లిస్తేనే కారు ని వదులుతామని చెప్పారు. తమ బిడ్డ పరిస్థితి ఎంతో విషయంగా ఉందని.. వెంటనే వదిలితే హాస్పిటల్ కి వెళ్లాలని సరస్వతి ఎంతగానో ప్రాదేయపడింది.
తాము ఎంతగా ప్రాదేయపడినా.. వెయ్యి రూపాయలు ఇస్తే కానీ కారు ని విడిచే ప్రసక్తే లేదని ట్రాఫిక్ పోలీసులు చెప్పారని.. కొంచెం కూడా మానవత్వం లేకుండా చలానా కోసం అరగంటపైనే తమ కారును ఆపేశారని బాబు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నీలోఫర్ ఆస్పత్రికి చేరుకునే సరికి ఆలస్యమైందని, అప్పటికే బాబు చనిపోయాడని డాక్టర్లు చెప్పారన్నారు. యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు కారును ఆపడం వల్లే తన కొడుకు చనిపోయాడని.. అరగంట ముందుగా తీసుకువస్తే బాబు బతికేవాడని డాక్టర్లు చెప్పారని చిన్నారి తల్లి కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదిలా ఉంటే.. వంగపల్లి వద్ద వాహనాన్ని ఆపిన సంఘటనలో భిన్న వాదన వినిపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. తాము వాహనాలు తనిఖీ చేసే సమయంలో డ్రైవర్ కారులో సీటు బెల్టు పెట్టుకోకపవడం వల్ల ఆపామని.. ఏదైనా పెండింగ్ చెలాన్లు ఉంటే సరైన సమయంలో చెల్లించాలని డ్రైవర్ కి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టామని అన్నారు ట్రాఫిక్ సీఐ సైదయ్య. కారు లో ఉన్న వారు బాబు కి సీరియస్ అని తమకు ఏమీ చెప్పలేదని అలా అయితే వెంటనే ఆ కారు వెళ్లడానికి ట్రాఫిక్ కూడా క్లీయర్ చేసేవాళ్లమని అన్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.