తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనర్ల పెళ్లిళ్లపై దృష్టి సారించింది. బాల్య వివాహాలు జరగటం ముఖ్యంగా అరబ్ షేక్‌లు కాంట్రాక్ట్ పద్దతిలో మైనర్లను పెళ్లి చేసుకుంటున్న ఘటనలు రాష్ట్రంలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మైనర్ల వివాహాలు జరగకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లింలు పెళ్లి చేయాలంటే ఆధార్ తప్పని సరి చేసింది. పెళ్లి సమయంలో వధూవరుల ఆధార్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని, వయస్సును ధ్రువీకరించాలని వక్ఫ్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. పెళ్లి వివరాలను ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని పేర్కొంది. గతంలోలా ఖాజీలు ఎలా పడితే అలా పెళ్లిళ్లు చేయటానికి వీలు లేదని, ఆధార్ కార్డులో వయసును నిర్ధారించుకున్న తర్వాతే పెళ్లి చేయాలని ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వం ఖాజీలకు సైతం హెచ్చరికలు జారీ చేసింది. మైనర్, కాంట్రాక్ట్ పెళ్లిళ్లు చేస్తే కఠినంగా శిక్షిస్తామని తేల్చి చెప్పింది. ఖాజీల నియామక బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసినపుడు హైదరాబాద్ హజ్‌హౌస్‌లోని నాజిరుల్ ఖజాత్ ఆఫీస్‌కు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. అన్ని పరిశీలించిన తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్‌ను అధికారులు ఆన్‌లైన్‌లో ఉంచుతారని తెలిపింది. మైనర్ల వివాహాలు, కాంట్రాక్ట్ పెళ్లిళ్లను అడ్డుకునేందుకే ఆన్‌లైన్ సిస్టాన్ని తెచ్చామని వెల్లడించింది. మరి, మైనర్ల వివాహాలు, కాంట్రాక్ట్ పెళ్లిళ్లను అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.