భీమ్లా నాయక్‌లో ‘ఆడ కాదు.. ఈడా కాదు’ పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన ప్రతిభతో పద్మశ్రీ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంలోనే తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలు, ఇంటి పట్టా ఇస్తామని ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కిన్నెర వాయిద్య కారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్యకు ఇచ్చిన మాటను తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంది. మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంలో ప్రభుత్వం ఆయన్ని ఘనంగా సన్మానించింది. కోటి రూపాయలతో పాటు ఇంటి పట్టా ఇస్తామని ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం తాజాగా, ప్రభుత్వం ఆయనకు ఇంటి పట్టాను అందజేసింది. బుధవారం బూర్గుల రామకృష్ణా రావ్ భవన్‌లో ప్రముఖులకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిన్నెర మొగులయ్యతో పాటు షూటర్ ఇషా సింగ్‌కు కూడా ఇంటి పట్టాను అందజేశారు. దీనిపై మొగులయ్య ఆనందం వ్యక్తం చేశారు.
కాగా, దర్శనం మొగులయ్య 12 మెట్ల కిన్నెరను వాయించడంలో ప్రసిద్ధి చెందారు. దాదాపు 52 దేశాల ప్రతినిధుల ముందు తన 12 మెట్ల కిన్నెర గానాన్ని వినిపించారు. ఆయన జీవిత చరిత్ర తెలంగాణ పాఠ్య పుస్తకంలో అచ్చువేయబడింది. అయితే, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాలో పాట పాడటం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత మొగులయ్య జీవితంలో కొంత మార్పు వచ్చిందని చెప్పాలి. ఈ సినిమా కారణంగానే తనకు మంచి గుర్తింపు వచ్చిందని స్వయంగా ఆయనే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మరి, కిన్నెర మొగులయ్యకు ఇంటి పట్టా పంపిణీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.