స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేక జీవో ద్వారా రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలని నిర్ణయించింది. వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమీషన్‌కు లేఖ రాసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. వచ్చే నెలలో అంటే సెప్టెంబర్‌లోనే ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రత్యేక జీవో ద్వారా రిజర్వేషన్లపై ఉన్న క్యాప్ తొలగించేందుకు సిద్ధమైంది. తెలంగాణ కేబినెట్ ఈ మేరకు ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది. సెప్టెంబర్ 30 తేదీలోగా రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సిందిగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాకుండా విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కేబినెట్‌లో చర్చించారు. ఇందులో భాగంగానే ప్రత్యేక జీవో విడుదల చేయాలని నిర్ణయించింది. అటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సైతం లేఖ రాసింది. సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఎన్ని వార్డులు , ఎన్ని సర్పంచ్‌లకు ఎన్నికలు జరగనున్నాయో నిర్ణయం పూర్తయింది.