ఓ వైపు మహిళలను దేవతలు.. ఆది పరాశక్తి అంటూనే ఆడపిల్ల పుడితే మాత్రం పెదవి విరుస్తుంటారు. తరాలు మారినా.. టెక్నాలజీ ఎంత వేగంగా ముందుకు సాగుతున్నా.. ఆడపిల్లపై వివక్ష మాత్రం అలాగే కొనసాగుతోంది. ఆడబిడ్డ పుట్టిందని భార్యను వేధించడం, పురిటిబిడ్డను పొదల్లో వదిలేయడం, కొందరైతే లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి ఆడబిడ్డ అని తేలితే అబార్షన్ చేయిస్తున్న ఘటనలు తరుచూ చూస్తూనే ఉన్నాం. కానీ ఓ గ్రామ సర్పంచ్ మాత్రం తన మంచి మనసు చాటుకున్నాడు.. ఆడబిడ్డను కనే దంపతులకు బంపరాఫర్ ప్రకటించారు.
వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఆదర్శగ్రామమైన మరియపురంలో ఆడపిల్ల పుడితే రూ.10వేల కానుక ఇస్తామని గ్రామ సర్పంచి, నిర్మల ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ అల్లం బాలిరెడ్డి ప్రకటించారు. తనను నమ్మి సర్పంచ్ గా ఎన్నుకున్న గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. దేశంలోనే ఆదర్శగ్రామంగా నిలిపిన సంగతి తెలిసిందే. సుకన్య సమృద్ధి యోజన కింద ఆడబిడ్డ పేరుతో బ్యాంకులో ఈ మొత్తాన్ని డిపాజిట్ చేస్తామని చెప్పారు. అయితే 2019 ఫిబ్రవరిలో సర్పంచిగా తాను పదవి చేపట్టిన నాటి నుంచి గ్రామంలో 8 మంది ఆడపిల్లలు జన్మించారని, వారందరి పేరిట డబ్బు డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. తాను సర్పంచ్ పదవిలో ఉన్నంత కాలం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానన్నారు.
ఈ నెల 20న నిర్మల ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 8 మంది బాలికల తల్లిదండ్రులకు డిపాజిట్ పత్రాలు అందజేస్తామన్నారు. ఇదిలా ఉంటే.. గతంలో గ్రామస్థుల సహకారంతో గ్రామంలో పలు అభివృద్ధి పనులను కూడా చేయించారు బాలిరెడ్డి. రూ.2లక్షలతో చేపట్టిన మినరల్‌వాటర్ ప్లాంట్, రూ.1.80 లక్షల విలువైన చెత్త సేకరణ ఆటో మొక్కలు పెంపకం.. డంపింగ్ యార్డులు.. ఇలా పలు కార్యక్రమాలను సొంతంగా నిర్వహించారు. తమ గ్రామా అభివృద్ది, ఆడపిల్లల విషయంలో ఆయన చూపిస్తున్న ఔదార్యం గురించి సర్పంచ్ అల్లం బాలిరెడ్డిపై గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు.