ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవికాలం ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఇంకా ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గుడ్న్యూస్ చెప్పింది వాతావరణ కేంద్రం.
వేసవికాలం మొదట్లోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటలు దాటితే చాలు ఎండ ప్రభావం మొదలవుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నిరుటి కంటే ఈసారి భారీ ఎండలు తప్పకపోవచ్చని అంటున్నారు. వేసవి మొదట్లోనే ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత కూడా ప్రారంభమైంది. దీంతో మధ్యాహ్నం వేళల్లో ఎక్కువమంది బయటకు రావడం లేదు. ఎండలు పెరుగుతుండటంతో అత్యవసరమైతే తప్ప జనాలు బయటకు రావడం క్రమంగా తగ్గుతోంది. ఏదైనా పని ఉన్నా, బయటకు వెళ్లాలన్నా ఉదయం లేదా సాయంత్రం పూట ప్లాన్ చేసుకుంటున్నారు.
రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం పూట ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు చల్లటి కబురు అందించింది వాతావరణ శాఖ. ఈ నెల 15 నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణలోని అనేక జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్లో పేర్కొంది. ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.