సాధారణంగా దొంగలు సామాన్యులను మొదలకుని ధనవంతుల వరకు అందరి ఇళ్లలో చోరీలు చేస్తుంటారు. అంతేకాక పోలీసులకు చిక్కకుండా ఎంతో తెలివితో దొంగతనాలకు పాల్పడుతుంటారు. అయితే పోలీస్ శాఖకు సంబంధించిన వస్తువుల జోలికి మాత్రం దొంగలు ఎక్కువగా వెళ్లారు. ఎందుకంటే.. తమని మాములుగానే పట్టుకునే పోలీసులు.. వారి వస్తువు పోయిందంటే ఇక చేధించే వరకు విడిచి పెట్టరు అనే అభిప్రాయం దొంగల్లో ఉంటుంది. కానీ ఓ దొంగ మాత్రం పోలీసు కారునే కాజేశాడు. ఏం గుండెరా బాబు? అంటూ తోటి దొంగలు అనుకునేలా చేశాడు ఆ దొంగ. చివరికి మాత్రం పోలీసులకు దొరికి.. జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన సూర్యపేట జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సూర్యాపేటలో కొత్త బస్టాండ్ వద్ద పోలీసులు ‘టీఎస్ 09 పీఏ0658’ నంబరు కలిగిన పెట్రోలింగ్ వాహనాన్ని నిలిపి ఉంచారు. అదే ప్రాంతంలో వేరే కేసు గురించి.. గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వాహనాన్ని అక్కడ వదలి అటుగా వెళ్లారు. ఆ పెట్రోలింగ్ వాహనం వద్ద ఎవరులేని విషయాన్ని గమనించిన దొంగ.. అక్కడి చేరుకున్నాడు. అదే సమయంలో ఆ వాహనానికే తాళం ఉండటంతో వాడి పంట పడింది. ఇంకేముంది క్షణం ఆలస్యం చేయకుండా వాహనాన్ని ఆ దుండగుడు చోరీ చేశాడు. గస్తీ కోసం వెళ్లిన పోలీసులు తిరిగి వచ్చిన చూసేసరికి తమ వాహనం కనిపించలేదు. దీంతో పోలీసు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించి.. గాలింపు చర్యలు చేపట్టారు. వాహనం చోరీకి గురైన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు.
వాటి ఆధారంగా వాహనాన్ని దొంగ తీసుకెళ్లిని దారిని గుర్తించారు. ఈ క్రమంలో కోదాడ సమీపంలో దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురువారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో ఈ చోరీ జరిగింది. ఇదే తరహాలో గతంలో కూడా ఓ ఘటన చోటుచేసుకుంది. ఒడిశాలోని రాయగడ్ లో పెట్రోలింగ్ వాహనాన్ని ఓ దొంగ అపరించాడు. ఆ తరువాత పోలీసులు ఆ దుండగుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రజల వస్తువులకు రక్షణగా ఉండే పోలీసుల వస్తువులను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. మరీ.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.