దేశంలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం కేసులు తగ్గుముఖం పడుతున్నాయీ అనుకున్నంతలోపే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రతిరోజూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య మొత్తం 415కు పెరిగింది. దేశంలోని 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్న వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా పలువురికి పాజిటివ్ గా వస్తోంది. ఒమిక్రాన్ అనుమానితుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు కీలక సూచనలు చేస్తూ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి జనవరి 2 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. బహిరంగ స్థలాల్లో జరిగే కార్యక్రమాలకు భౌతిక దూరాన్ని తప్పని సరి చేసింది. ఓమిక్రాన్ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సర్కార్ సూచిస్తోంది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించింది.
మాస్కులు పెట్టుకోకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చిరించింది. అంతేకాదు ఫైన్లు కూడా విధించబడుతాయని పేర్కొంది. ఇటీవల తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగాయి. , కరోనా పరిస్థితులపై హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జనాలు గుమికూడకుండా.. పండగల సమయంలో కఠిన ఆంక్షలు విధించాలని హైకోర్ట్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.