నందమూరి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. నందమూరి తారకరామారావు కోడలు, జయకృష్ణ భార్య అనారోగ్యంతో మరణించారు. ఎన్టీఆర్ అల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఈమె స్వయానా సోదరి కూడా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం తలెత్తింది. ఆయన రెండవ కుమారుడు నందమూరి జయకృష్ణ భార్య పద్మజ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. 73 ఏళ్ల పద్మజ గత కొద్దికాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఇవాళ ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆసుపత్రిలో చేర్చినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో చేర్చిన కాస్సేపటికే ప్రాణాలు పోయాయి.
నందమూరి తారక రామారావు రెండవ కుమారుడి భార్యే అయినా పెద్దకోడలుగా ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి రామకృష్ణ చిన్నప్పుడే మరణించడంతో రెండవ కుమారుడిగా ఉన్న జయకృష్ణే పెద్ద కుమారుడిగా వ్యవహరిస్తున్నారు. తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి జయకృష్ణ కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. రామకృష్ణ స్డూడియోస్ బ్యానర్‌లో నిర్మించిన పలు చిత్రాలకు జయకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. జయకృష్ణ కుమారుడు చైతన్య హీరోగా పరిచయమైనా సక్సెస్ కాలేదు. నందమూరి పద్మజ మరణవార్త విని విజయవాడ నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఢిల్లీ నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరి ఇతర కుటుంబీకులు బయలుదేరారు.