తెలంగాణ రాష్ట్రంలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏకగ్రీవం అయిన స్థానాలు మినహా.. ఇవాళ నల్గొండ, ఖమ్మం, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్లో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది.. ఉదయం 8 గంటలకు నుంచి సాయంత్రం 4 గంటలకు జరిగిన పోలింగ్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది.
మొత్తంగా పోలింగ్ ముగిసే సమయానికి 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. తుది ఫలితాలు తెలియాలంటే మాత్రం ఈ నెల 14వ తేదీ వరకు వేచిచూడాల్సిందే. ఇక, పోలింగ్ ముగియడంతో.. బ్యాలెట్ బాక్స్ లను అభ్యర్థుల సమక్షంలో సీజ్ చేసి స్ట్రాంగ్ రూమ్ లకు తరలిస్తున్నారు సిబ్బంది.. మరోవైపు స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
మెదక్ జిల్లాలో అత్యధికంగా 96.69 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో 87.73 శాతం పోలింగ్, నల్లగొండ జిల్లాలో 83.63 శాతం పోలింగ్, ఖమ్మం జిల్లాలో 79.95 శాతం, కరీంనగర్ జిల్లాలో 72.08 శాతం పోలింగ్ నమోదైంది. నిరంతరం సీసీ కెమెరాలతో పోలీస్ పహారా నిర్వహిస్తున్నారు.. ఈ నెల 14వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు అధికారులు.