అభం శుభం తెలియని చిన్నారి. పట్టుమని పన్నెండేళ్లు నిండలేదు. స్కూల్‌కు సెలవు లేకపోతే ప్రాణాలు నిలిచుండేవి. ఇంట్లో ఉన్న చిన్నారిని అంత క్రూరంగా ఎవరు హత్య చేశారు, రక్షించమంటూ పెట్టిన కేకలు ఎవరికీ విన్పించలేదా..సంచలనం రేపిన కూకట్‌పల్లి సహస్రాణి హత్యపై ఎన్నో సందేహాలు, మరెన్నో ప్రశ్నలు..పూర్తి వివరాలు మీ కోసం..
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని సంగీత్ నగర్‌లో పట్టపగలే 11 ఏళ్ల సహస్రాణి హత్యకు గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ చిన్నారి క్రూరంగా హత్యకు గురైంది. హత్య జరిగి 72 గంటలైనా ఇంకా మిస్టరీ వీడలేదు. ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారనేది అంతుబట్టడం లేదు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ అందరూ రంగంలో దిగినా ఫలితం కన్పించడం లేదు. మొత్తం 5 బృందాలుగా పోలీసు టీమ్ దర్యాప్తు చేస్తోంది. ఇంటికి దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా అణువణువూ పరిశోధిస్తున్నారు.
మూడో అంతస్థులో ఉంటున్న ఆ చిన్నారిని క్రూరంగా 20 కత్తిపోట్లు పొడిచి మరీ చంపారు. ఇంత క్రూరంగా ఆ పాపను హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎవరీ పని చేశారనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆ చిన్నారిని చంపి ఇంటి బయటి నుంచి గడియ పెట్టి వెళ్లిపోయారు. తండ్రి వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉన్న కుమార్తె కన్పించింది. చలించిపోయాడు. ఏడుపు, కేకలు విని స్థానికులు వచ్చారు. 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. 101 ను పిలిచారు. అప్పటికే ఆ ఆ చిన్నారి ప్రాణాలు గాలిలో కల్సిపోయాయి.
సీసీటీవీల్లో ఏముంది
ఇంటికి దగ్గరలో ఉన్న 2 సీసీటీవీ కెమేరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అందులో ఎక్కడా కొత్తవారు వచ్చినట్టు లేదా వెళ్లినట్టు కన్పించలేదు. అందుకే అదే భవనంలో ఉన్నవాళ్లే హత్య చేసుంటారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే పట్టపగలు కావడంతో బయటి వ్యక్తులెవరైనా వస్తే కచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్‌లో కన్పించేది. పోలీసులు ప్రస్తుతం అదే బిల్డింగులో రెండో అంతస్థులో ఉండే సంజయ్ ఉండే వ్యక్తిని అనుమానితునిగా అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
సహస్రాణి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. సంగారెడ్డి జిల్లాలోని బాలిక సొంత గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. చుట్టుపక్కల స్థానికులు కూడా ఎవరిపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయడం లేదు. నిజంగానే ఈ హత్య మిస్టరీగా మారిందంటున్నారు. వాస్తవానికి ఈ వీధిలో బయటివాళ్లు వచ్చే పరిస్థితి లేదని, ఎందుకంటే ఇది డెడ్ ఎండ్ అని అంటున్నారు. హత్య జరిగి మూడ్రోజులవుతున్నా ఎలాంటి పురోగతి లభించకపోవడంతో పోలీసులు ఇతర అంశాలపై దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా ఆర్ధిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలు, బ్లాక్ మాజిక్, కుటుంబ విబేధాలు వంటి కోణంలో విచారణ ప్రారంభించారు.