మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అని అందెశ్రీ కవిత నేటి సమాజంలో జరగుతున్న నగ్న సత్యాలను కళ్లకు కట్టినట్టుగా చెప్పారు. మనుషుల్లో మానవత్వం నానాటికి నశించిపోతోంది. కనీకరం అనే భావనే లేకుండా పోతోంది.
తాజాగా తల్లి ఒడిలో సేద తీరాల్సిన ఆ పసిగుడ్డు చెత్త కుప్పలో కనిపించింది. పుట్టి రెండు గంటలైనా కాకముందే మట్టిలో వదిలేశారు. ఈ ఘటన భద్రాచలంలో సోమవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. భద్రాచలం పట్టణంలోని బస్‌స్టాండ్ ఎదురుగా ఉన్న రాఘవేంద్ర హోటల్ పక్క సందులో ఓ చెత్తకుప్ప ఉంది. ఆ చెత్త కుప్పల్లోంచి చిన్నారి ఏడుపులు వినిపిస్తుండటంతో స్థానికులు గమనించారు. శిశువుని గుర్తించి వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
ఆసుపత్రిలో ఆ శిశువుకు వైద్యం అందిస్తున్నారు. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని, చిన్నచిన్న గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పాపను చెత్తకుప్పలో ఎవరు వదిలి వెళ్లారు? ఎందుకు వదిలిపెట్టారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.