ట్విట్టర్ ని ఢీ కొట్టే యాప్ రాదని అనుకున్న సమయంలో దానికి గట్టి పోటీ ఇచ్చే విధంగా మెటా నుంచి థ్రెడ్స్ యాప్ లాంఛ్ అయ్యింది. లాంఛ్ అయిన కొన్ని గంటల్లోనే కోటి మందికి పైగా యాప్ ఇన్స్టాల్ చేశారు.
ట్విట్టర్ కు పోటీగా మెటా సంస్థ థ్రెడ్స్ పేరుతో యాప్ ని లాంఛ్ చేసింది. గురువారం నాడు ఈ టెక్స్ట్ ఆధారిత యాప్ ను ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది మెటా. యాప్ లాంఛ్ అయిన గంటల్లోనే కోటి మందికి పైగా ఖాతాలు తెరిచారు. మెటాకు చెందిన ఇన్స్టాగ్రామ్ కు అనుసంధానంగా ఈ థ్రెడ్స్ యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్విట్టర్ తరహా ఫీచర్లు కలిగి ఉన్న ఈ యాప్ లో ఇన్స్టాగ్రామ్ ఖాతాతో లాగిన్ అయిపోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఉన్న పేరుతో లాగిన్ అవ్వచ్చు. దీని వల్ల ట్విట్టర్ ఖాతాదారుల సంఖ్యను థ్రెడ్స్ యాప్ బీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఇన్స్టాగ్రామ్ తో కనెక్షన్ ఉండడం వల్ల అందులో ఉన్న ఫాలోవర్స్ ని, ఖాతాలను థ్రెడ్స్ లో కూడా అనుసరించే వీలుంటుంది.
ట్విట్టర్ లానే టెక్స్ట్ రూపంలో ఉన్న పోస్టులను లైక్ చేయచ్చు, కామెంట్ చేయచ్చు, ఇతరులకు షేర్ చేయవచ్చు. థ్రెడ్స్ యాప్ ని లాంఛ్ చేసిన సందర్భంగా జుకర్ బర్గ్ మాట్లాడుతూ.. సంభాషణలు జరిపేందుకు స్నేహపూర్వకమైన బహిరంగ వేదిక ఇదని.. టెక్స్ట్ సంభాషణలు చేసుకునేవారికి కొత్త అనుభూతిని, అనుభవాన్ని ఇస్తుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచానికి థ్రెడ్స్ లాంటి స్నేహపూర్వకమైన కమ్యూనిటీ చాలా అవసరమని.. థ్రెడ్స్ ఆ సౌలభ్యాన్ని కల్పిస్తుందని అన్నారు. ఇక థ్రెడ్స్ ట్విట్టర్ ని బీట్ చేస్తుందన్న ప్రశ్నకు.. దానికి కొంత సమయం పడుతుందని జుకర్ బర్గ్ అన్నారు. వందల కోట్ల మంది ఖాతాదారులతో ఒక బహిరంగ సంభాషణ యాప్ ఉండాలని తాను భావిస్తున్నానని.. ట్విట్టర్ కు ఆ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయిందని, ఆ ఘనత మేం తప్పకుండా సాధిస్తామని అన్నారు.
ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ రెండిటికీ ఒక బిలియన్ కంటే ఎక్కువ వినియోగదారులు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఖాతాదారులు థ్రెడ్స్ ని వినియోగిస్తే ఆ ట్విట్టర్ ని బీట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే జుకర్ బర్గ్ వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ స్పందించారు. ఓ ట్విట్టర్ యూజర్ పెట్టిన కౌంటర్ ట్వీట్ కి ఎలాన్ మస్క్ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు. ‘థ్రెడ్స్ ని తీసుకొచ్చేందుకు మెటా కీబోర్డులో కంట్రోల్ సీ, కంట్రోల్ వీ కీస్ వాడిందని నెటిజన్ ట్వీట్ చేయగా దానికి ఎలాన్ మస్క్ నవ్వు ఎమోజీని పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే 11 ఏళ్ల తర్వాత మార్క్ జుకర్ బర్గ్ ట్విట్టర్ లోకి వచ్చారు. ఎప్పుడో 2012లో ట్వీట్ చేసిన మార్క్.. మళ్ళీ ఇన్నాళ్ళకి ఒక ట్వీట్ చేశారు.
1967 కాలం స్పైడర్ మ్యాన్ కార్టూన్ ఫోటోని షేర్ చేశారు. కార్టూన్ లో విలన్ స్పైడర్ మ్యాన్ డ్రెస్సులో హీరోలా కనిపిస్తాడు. దీంతో ఇది మస్క్ ని ఉద్దేశించి చేసిందే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ థ్రెడ్స్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలంటే ప్లే స్టోర్ లో థ్రెడ్స్ ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేయాలి. నలుపు రంగు బ్యాక్ గ్రౌండ్ మీద తెల్ల రంగులో థ్రెడ్స్ లోగో కనబడుతుంది. లేదంటే ఇన్స్టాగ్రామ్ యాప్ లోకి వెళ్తే థ్రెడ్స్ ఆప్షన్ కనబడుతుంది. కుడి వైపున పైన 3 గీతలు ఉన్న చోట నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ కింద థ్రెడ్స్ అని కనబడుతుంది. అది క్లిక్ చేస్తే గెట్ థ్రెడ్స్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ప్లే స్టోర్ లోకి తీసుకెళ్లి యాప్ చూపిస్తుంది. ఇన్స్టాల్ అయ్యాక ఇన్స్టాగ్రామ్ ఖాతాతో లాగిన్ అవ్వచ్చు.
— Mark Zuckerberg (@finkd) July 6, 2023