ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న లగ్జరీ కార్లు.. మన దేశంలో పలువురు సెలబ్రిటీలు వాడుతున్న సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన వారు.. ఈ లగ్జరీ కార్లపై మోజు పడతారు. వాటిని సొంతం చేసుకుని సంతోషిస్తారు. ఇప్పటికే లంబోర్గిని, ఆస్టన్, ఫెరారీ వంటి ప్రముఖ బ్రాండ్లు .. మన దేశంలో.. తమ కంపెనీల లగ్జరీ కార్లను అమ్మకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మరో ఖరీదైన బ్రాండ్ మెక్‌లారెన్ వచ్చి చేరింది. కొన్ని రోజుల కిందటే.. మెక్‌లారెన్.. తన మొదటి డీలర్‌షిప్‌ను ముంబైలో ప్రారంభించింది. ఈ వేడుకల్లో భాగంగా.. ఈ కంపెనీ.. తన ఫ్లాగ్‌షిప్ సూపర్‌కార్ మెక్‌లారెన్ 765 LTని ఆవిష్కరించింది. ప్రస్తుతం భారతదేశంలో అధికారికంగా అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన కార్లలో ఇది ఒకటి.
ఈ క్రమంలో మెక్‌లారెన్.. ఇప్పటికే.. తన మొదటి కస్టమర్‌కు ఈ కార్‌ని డెలివరీ చేసింది. ఇండియాలోనే అత్యంత ఖరీదైన మెక్‌లారెన్ 765 LT తొలి కారును హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త.. నసీర్ ఖాన్ కొనుగోలు చేశాడు. ప్రస్తుతానికి దీని కచ్చితమైన ధర తెలియనప్పటికి.. మార్కెట్ వర్గాల ప్రకారం సుమారు 12 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. మెక్‌లారెన్ కార్ల సంస్థను ఇండియాలో ఇన్ఫినిటీ గ్రూప్ నిర్వహిస్తోంది. ఈ బ్రాండ్ తన మొత్తం పోర్ట్‌ఫోలియోను భారతదేశ వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తోంది.
ప్రస్తుతం మెక్‌లారెన్ 765 LT ఉత్పత్తి 765 యూనిట్లకు పరిమితం చేశారు. ప్రస్తుతం మన దేశంలో ఉన్న సూపర్ కార్ల కంటే.. ఇది మరింత ప్రత్యేకమైనది. దీన్ని 4.0లీటర్ ట్విన్ టర్బోచార్జుడ్ V8 పెట్రోల్ ఇంజిన్‌తో తయారు చేశారు. దీనిలో మరో ప్రత్యేకమైన అంశం ఏంటంటే.. ఈ కన్వర్టబుల్ కారు పైకప్పు కేవలం 11 సెకన్లలో తెరుచుకుంటుంది. మెక్‌లారెన్ ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత వేగవంతమైన కన్వర్టబుల్ కార్లలో ఇది అత్యంత అద్భుతమైనది. ఇక ఈ కారును సొంతం చేసుకున్న వైదరాబాద్ బిజినెస్ మ్యాన్ నసీర్ ఖాన్ వద్ద ఇప్పటికే అనేక ఖరీదైన కార్లు ఉన్నాయి. లంబోర్గిని, రోల్స్ రాయిస్, ఫెరారీ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి… తాజాగా ఇప్పుడు మెక్‌లారెన్ కారును కొనుగోలు చేశాడు.