12 ఏళ్ల తర్వాత స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ నెగ్గాలంటే సారథి ఒక్కడు బాగుంటే సరిపోదని.. జట్టులోని ప్లేయర్లంతా కష్టపడితేనే సాధ్యమని యువీ అన్నాడు.
వన్డే వరల్డ్ కప్ సమీపిస్తున్న కొద్ది ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. సెమీస్ కు చేరే నాలుగు జట్లేవో మెక్ గ్రాత్ అంచనా వేయగా.. బుమ్రా లేకుండా భారత జట్టు ప్రపంచకప్ నెగ్గడం సాధ్యమయ్యే పని కాదని మహమ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో భారత్ కు రెండు ప్రపంచకప్ లు (2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్) అందించడంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా చేరిపోయాడు.
గతంలో వరల్డ్ కప్ నెగ్గిన జట్లతో ప్రస్తుత జట్టును పోల్చిన యువీ.. కెప్టెన్ ఒక్కడే మెరుగ్గా రాణిస్తే సరిపోదని.. మిగిలిన ఆటగాళ్లందరూ సమిష్టిగా సత్తాచాటితేనే ప్రపంచ కప్పు గెలువగలమని పేర్కొన్నాడు. ఓ ఆన్ లైన్ కార్యక్రమంలో యువరాజ్ తన అభిప్రాయం వెల్లడించాడు.‘రోహిత్ శర్మ మంచి కెప్టెనే. ఇందులో సందేహించేందుకు ఏం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అతడు ముంబై ఇండియన్స్ కు ఐదు టైటిల్స్ అందించాడు. అయితే అతడికి మంచి జట్టు కూడా ఉండాలి.
అప్పుడే పెద్ద టోర్నీల్లో గెలవగలుగుతాడు. ఎంఎస్ ధోనీ కూడా మంచి సారథే. అతడికి మంచి జట్టు దొరకింది. సీనియర్లు, నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉండటంతో అందరి సహకారంతో వన్డే ప్రపంచకప్ టైటిల్ దక్కింది. క్లిష్ట సమయాల్లో రోహిత్ కూడా కూల్ గా ఉంటాడు. ఒత్తిడిని ఎలా జయించాలో అతడికి బాగా తెలుసు. అతడికి మంచి జట్టు, అనుభవం ఉన్న ఆటగాళ్లను ఇస్తే.. వాళ్లతో అతడు అద్భుతాలు చేయగలడు’ అని యువరాజ్ పేర్కొన్నాడు.జట్టు లో ఒకరిద్దరూ కీలక ప్లేయర్లు ఉంటే సరిపోదని.. మిగిలిన వాళ్లు కూడా రాణిస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని యువీ అభిప్రాయపడ్డాడు.
ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. ఇప్పటి వరకు భారత జట్టులో ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో అనేది ఇంకా తేలలేదు. మెగాటోర్నీలో కీలకమవుతారనుకున్న రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, లోకేశ్ రాహుల్ గాయాలతో సహవాసం చేస్తుంటే.. ఫిట్ నెస్ సాధించి ఐర్లాండ్ తో టూర్ కు సారథిగా ఎంపికైన జస్ప్రీత్ బుమ్రా ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.