పరుగుల యంత్రంగా పేరు సంపాదించుకున్నా కూడా.. విరాట్ కోహ్లీకి ఫెయిల్యూర్ కెప్టెన్ అనే మచ్చను మిగిల్చారు. వ్యక్తిగత ప్రదర్శన పరంగా అతడిని ఎంత అభిమానించినా.. కెప్టెన్సీ విషయంలో మాత్రం ట్రోల్ చేసేవాళ్లు. అయితే తొలిసారి తనని ఫెయిల్యూర్ కెప్టెన్ గా చేయడంపై కోహ్లీ స్పందించాడు.
విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీ, రన్స్ మెషిన్ ఇలా పేరు ఏదైనా.. మనోడి క్రేజ్ మాత్రం మాములుగా ఉండదు. ఒక ఆటగాడిగా కోహ్లీ ఎంతో సాధించాడు. క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులను, మరెన్నో మైలురాళ్లను అధిగమించాడు. చాలామంది క్రికెటర్లు అసలు ఊహించడానికి కూడా సాధ్యంకాని ఎన్నో రికార్డులను కోహ్లీ సాధించాడు. కానీ, ఒక కెప్టెన్ గా మాత్రం కోహ్లీపై ఇప్పటికీ ఎన్నో విమర్శలు వస్తూనే ఉన్నాయి. తనని ఒక ఫెయిల్యూర్ కెప్టన్ అంటూ చాలామంది ముద్ర వేశారు. అదే విషయాన్ని పదే పదే ప్రస్తావించారు కూడా. అయితే ఈ విషయంపై కోహ్లీ ఎప్పుడూ స్పందించలేదు. కానీ, తొలిసారి కోహ్లీ ఆ విషయంపై మనసువిప్పి మాట్లాడాడు.
విరాట్ కోహ్లీ గురించి క్రికెట్ ప్రపంచానికి ఎలాంటి పరిచయాలు అక్కర్లేదు. టాలెంట్, దూకుడు కలిగిన ఒక గొప్ప ఆటగాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడతాడు. ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. కానీ, విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ కెప్టెన్ అంటూ ఉంటారు. ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా సాధించలేకపోయాడని కామెంట్స్ చేసేవారు.. ఇప్పటికీ కొందరు కామెంట్ చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి అలాంటి వ్యాఖ్యలపై కోహ్లీ ఎప్పుడూ స్పందించింది లేదు. తాజాగా ఆర్సీబీ పాడ్ కాస్ట్ లో మొదటిసారి తనని ఫెయిల్యూర్ కెప్టెన్ అనడంపై మనసు విప్పి మాట్లాడాడు. తన ఆవేదనను వెల్లిబుచ్చాడు. అది విన్న అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు.
“2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, అంతేకాకుండా వరుసగా 5 టెస్ట్ మ్యాచులు గెలిచిన రికార్డు అందుకున్నాను. ఇలాంటి ఎన్నో విజయాలు వారికి కనిపించలేదు. ఎన్నో అద్భుతమైన మ్యాచులు గెలిచినా నన్ను ఒక ఫెయిల్యూర్ కెప్టెన్ అని విమర్శించారు. నా కెరీర్ లోనే నేను ఇప్పటికే చాలా భిన్నమైన దశలను చూశాను. ఐపీఎల్ 2022లో అయితే నాకు విషమ పరీక్ష అనే చెప్పాలి. ఆ సమయంలో నాకు ధోనీ ఒక్కడే అండగా నిలిచాడు. ధోనీతో అనుబంధం దొరకడం నా అదృష్టంగా భావిస్తాను. నాకు ఆయన ఎప్పుడూ అండగానే ఉంటాడు.
నువ్వు ఎప్పుడైతే బలంగా ఉండాలి అనుకుంటావో అప్పుడు నిన్ను నువ్వు దృఢమైన వ్యక్తిగా చూసుకో అంటూ చెప్పేవాడు. ధోనీ సారథ్యంలో నేను డిప్యూటీగా చాలా మ్యాచ్ లు ఆడాను. అతని గేమ్ ప్లాన్ ని బాగా అర్థం చేసుకున్నాను. నాకు జట్టును నడిపించగల సామర్థ్యం ఉన్నట్లు ధోనీ నమ్మి.. నన్ను కెప్టెన్ గా ప్రమోట్ చేశాడు. ధోనీ కెప్టెన్సీలో గానీ, నా కెప్టెన్సీలో గానీ మాకు ఎలాంటి అసౌకర్యం కలిగిన సందర్భం లేదు. మా ఇద్దరి మధ్య క్లారిటీ మాత్రమే కాదు.. నమ్మకం కూడా చాలా ఎక్కువ. 2012లో ఆస్ట్రేలియా జరిగిన మూడో టెస్టు మ్యాచ్ తో నా కెరీర్ మలుపు తిరిగింది. 2018 ఇంగ్లండ్ పర్యటనలో తొలి టెస్టు ముందు 2014 ఏడాది ఘటనలు గుర్తుకొచ్చాయి.
నేను బ్యాటింగ్ వెళ్లిన క్షణంలో నాపై విమర్శలు గుప్పించారు. నేను అప్పుడు 149 పరుగులు చేశాను. అప్పుడు నేను- అనుష్క ఎంతో భావోద్వేగానికి గురయ్యాం. అలాగే చాలా సంతోషించాం కూడా. నాన్న అకాల మరణం తర్వాత కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టాను. ఆయన కల నెరవేర్చాలనే కసి మరింత పెరిగింది” అంటూ విరాట్ కోహ్లీ కామెంట్ చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్న విరాట్ ప్రస్తుతం బ్రేక్ లో ఉన్నాడు. ఈ సమయంలో ఆర్సీబీ పోడ్ కాస్ట్ లో ఈ విషయాలు పంచుకున్నాడు. విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ కెప్టెనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.