లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్) మ్యాచ్‌ను వీక్షించేందుకు ఓ ప్రత్యేక అతిథి మైదానంలోకి రావడం కలకలం సృష్టించింది. దీంతో మ్యాచ్‌కు బ్రేక్ ఇవ్వక తప్పలేదు. ప్రత్యేక అతిథి ఏంటి.. మ్యాచ్ ఆగడమేంటి అనుకుంటున్నారా..
ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ లీగ్‌లకు విపరీతమైన ఆదరణ లభిస్తుండటంతో.. ‘లంక ప్రీమియర్ లీగ్’ (ఎల్‌పీఎల్) పేరిట శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా లీగ్ ప్రారంభించింది. 2020లో మొదలైన ఈ లీగ్.. మూడు సీజన్‌లు ముగించుకొని నాలుగో సీజన్‌లోకి అడుగుపెట్టింది. స్థానిక ఆటగాళ్లతో పాటు విదేశీ స్టార్లు పాల్గొంటున్న ఈ లీగ్ రెండో మ్యాచ్‌లో ఓ అరుదైన దృశ్యం దర్శనమిచ్చింది. సాధారణంగా పక్షులు, కుక్కలు, తేనెటీగల కారణంగా క్రికెట్ మ్యాచ్‌లకు అంతరాయం కలగడం అంతా చూసే ఉంటారు కానీ.. పాము వల్ల మ్యాచ్ ఆగుతుందని ఊహించారా!
ఎల్‌పీఎల్ నాలుగో సీజన్‌లో భాగంగా గాలె టైటాన్స్, దంబుల్లా ఔరా జట్ల మధ్య ఈ రోజు జరిగిన పోరుకు ఓ పాము అతిథిగా విచ్చేసింది. దీంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. గాలె జట్టుకు ప్రాతనిధ్యం వహిస్తున్న బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో బంతి వేయడం ఆపేసిన షకీబ్ అటే చూస్తూ నిలబడిపోయాడు. ఏం జరిగిందని ఇతర ఆటగాళ్లు అడగగా.. మైదానంలోకి పాము వచ్చిందని పేర్కొన్నాడు. దీంతో అప్రమత్తమైన అంపైర్లు పామును బయటకు పంపించిన తర్వాత తాపీగా మ్యాచ్‌ను ప్రారంభించారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అసలు పాముకు టికెట్ ఎవరిచ్చారని ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక భారత వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఈ వీడియోపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ‘నాగిన్ మళ్లీ వచ్చింది. పాపం బంగ్లాదేశ్ అనుకొని ఉంటుంది’ అని డీకే ట్వీట్ చేయగా.. దీనిపై మరింత చర్చ జరుగుతోంది.
గతంలో పలుమార్లు బంగ్లాదేశ్ విజయం సాధించిన సమయంలో ఆ జట్టు ప్లేయర్లు నాగిన్ డాన్స్ చేస్తూ సంబురాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఉద్దేశంతోనే డీకే పై విధంగా ట్వీట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట గాలె 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేయగా.. దంబుల్లా కూడా 7 వికెట్లు కోల్పోయి సరిగ్గా 180 పరుగులే చేసింది. దీంతో విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్ నిర్వహించగా.. అందులో గాలె టైటాన్స్ విజయం సాధించింది.
The naagin is back
I thought it was in Bangladesh 🤣😂🤣😂🤣#naagindance#nidahastrophy https://t.co/hwn6zcOxqy
— DK (@DineshKarthik) July 31, 2023