టీమిండియా-న్యూజిలాండ్ మ్యాచ్ చూసిన ఎవరికైనా సరే ఒక్కటే డౌట్. అన్నిసార్లు ఫెయిలవుతున్నా సరే పంత్ కు మళ్లీ మళ్ళీ ఛాన్సులు ఎందుకు ఇస్తున్నారు? అదే ఛాన్స్ సంజూ శాంసన్ కి ఇవ్వొచ్చుగా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ రియాలిటీ చాలా ఘోరంగా ఉంది. వన్డే, టీ20 జట్లకు కెప్టెన్లు మారుతున్నారు గానీ సంజూ తలరాత మాత్రం మారడం లేదు. ప్రతి ఒక్కరూ అతడికి మొండిచేయి చూపిస్తూనే ఉన్నారు. దీంతో మనోడికి కూడా ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. మ్యాచ్, సిరీస్ గెలిచాం, ఓడాం అనేది పక్కనబెడితే.. సంజూ శాంసన్ కి ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు అనే టాపిక్, క్రికెట్ ప్రేమికుల మధ్య హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియాలో ఆడాలంటే రాసిపెట్టుండాలి. కానీ అది సంజూ శాంసన్ కి లేనట్లు కనిపిస్తుంది. ఎందుకంటే అవకాశమిచ్చినా ప్రతిసారి కూడా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. కానీ వేరే ప్లేయర్లు విఫలమవుతున్నా సరే అతడికి మాత్రం ఛాన్సులు ఇవ్వట్లేదు. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలోనూ పంత్ ని తీసుకున్నారు. కానీ అతడు 16 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. దీంతో సంజూని ఎందుకు తీసుకోలేదు అని విషయం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే నిలకడలేమితో సతమతమవుతున్న టీమిండియా వికెట్ కీపర్ పంత్ కు తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ అండగా నిలిచాడు. పంత్ మ్యాచ్ విన్నర్ అని, ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించగల సత్తా ఉందని అన్నాడు. ఈ టాలెంట్ ఉంది కాబట్టే.. వరసగా విఫలమవుతున్నా సరే టీమ్ మేనేజ్ మెంట్ అతడికి సపోర్ట్ గా ఉందని చెప్పాడు.
‘ఇంగ్లాండ్ లో పంత్ సెంచరీ చేశాడు. సెంచరీ చేసిన ఏ ఆటగాడికైనా సరే జట్టు నుంచి మద్దతు లభిస్తుంది. ఓవరాల్ గా చూస్తే పంత్ ఓ మ్యాచ్ విన్నర్. అతడికి అండగా నిలవాల్సిన అవసరముంది. చాలా అనాలిసిస్ తర్వాతే పంత్ కు అండగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. సంజూ శాంసన్ కూడా వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. అయితే కొన్నిసార్లు అద్భుతంగా ఆడినా సరే వెయిట్ చేయక తప్పదు. సంజూ కూడా ఓ మ్యాచ్ విన్నర్. కొన్నిసార్లు బాగా ఆడినప్పటికీ అతడికన్నా ముందు ఓ ఆటగాడు రాణిస్తే అతడికే అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది’ అని టెంపరరీ కెప్టెన్ ధావన్ చెప్పాడు. ఇదిలా ఉండగా కివీస్ తో తొలి వన్డేలో 36 పరుగులు చేసిన సంజూ బాగానే ఆడాడు. రెండో మ్యాచ్ లో బౌలర్ కోసం దీపక్ హుడాను సెలెక్టర్లు ఎంపిక చేశారు. దీంతో సంజూ మళ్లీ బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక బుధవారం జరిగిన మూడో వన్డేలోనూ పంత్ కే ఛాన్స్ ఇవ్వగా అతడు 10 పరుగులే చేశాడు. మరి శాంసన్ ని కాదని పంత్ కు అవకాశమివ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.