28 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.. 130 కోట్ల మంది గుండెలు గర్వంతో ఉప్పొంగాయి.. ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ చిరకాల కోరిక నెరవేరింది.. 2011లో భారత్ వన్డే వరల్డ్ కప్‌ను ముద్దాడటంతో ఇలాంటి మధుల క్షణాలు సాక్ష్యాత్కారం అయ్యాయి. ఈ గొప్ప విజయం సాధించేందుకు జట్టులోని ఆటగాళ్లందరూ తమ వంతు కష్టపడ్డారు. తమ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌తో.. టీమిండియా వరల్డ్ కప్ గెలిచేందుకు తోడ్పాడ్డారు. కానీ.. ఒక్కడు మాత్రం ఏకంగా ప్రాణాలు సైతం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. గ్రౌండ్‌లోనే రక్తంకక్కుకున్నా.. దేశానికి వరల్డ్ కప్ అందించాలనే పట్టుదలతో అలాగే మొండిగా ఆడి.. కొన్ని కోట్లమంది కలలను తన గుండెల్లో మోశాడు.. ప్రాణాలకు తెగించి భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు.. అతడే 2011 వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్.
యువరాజ్ సింగ్ కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు.. పోరాట యోధుడు. గెలిచేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయని తెగువ అతని సొంతం. ఆ తెగువే.. సచిన్ చిరకాల కోరకను తీర్చగలిగింది. క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ ఎంత గొప్ప దిగ్గజ ఆటగాడైనా.. టన్నుల కొద్ది పరుగులు చేసినా.. భారత్‌కు వరల్డ్ కప్ అందించలేకపోయాడు. ఆ వెలితి, చంద్రుడిపై చిన్న మచ్చలా అలానే ఉండిపోయింది. కానీ.. సచిన్‌ను ఎంతో అభిమానించే యువీ వల్లే ఆ మచ్చ తొలగిపోయింది. 2011 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే.. ‘వరల్డ్ కప్ గెలిచి సచిన్‌కు అంకితం ఇస్తాం’ అని ప్రకటించాడు యువీ. అదే టీమిండియాకు నినాదంగా మారింది. సచిన్ కోసం వరల్డ్ కప్ గెలవాలనే కసిని జట్టులో నింపింది. అంతే.. వరల్డ్ కప్ ఆసాంతం భారత ఆటగాళ్లు చెలరేగిపోయారు.
ముఖ్యంగా యువరాజ్ సింగ్.. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ టీమిండియాకు వెన్నుముకలా మారిపోయాడు. ఒకనొక దశలో గ్రౌండ్‌లోనే రక్తం కక్కుకున్నాడు. గ్రూప్ స్టేజ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 52 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. టీమిండియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత యువ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు సీనియర్ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్‌పై పడింది. జట్టు పరిస్థితులకు తగ్గట్లు ఇద్దరూ ఆడుతూ.. 100 పరుగుల భాగస్వామ్య నమోదు చేశారు. ఇంతలోనే కొండలాంటి మనిషి యువీ కూలిపోయినట్లు కూర్చున్నాడు. నోట్లో నుంచి రక్తం.. అంతే ఒక్కసారిగా అంతా షాక్. యువీకి ఏమైందో ఎవరికీ తెలియదు. అప్పటికే భయంకరమైన క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం ఒక్క యువీకే తెలుసు. కానీ.. వరల్డ్ కప్ గెలవాలనే తపన, సచిన్‌కు అంకితం ఇవ్వాలనే సంకల్పం అతన్ని వెనుకడుగు వేయనియలేదు.
ఆ తర్వాత సెమీస్‌లో ఆస్ట్రేలియాపై సంచలన ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఫైనల్లో గంభీర్, ధోని మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. యువీ సైతం ధోనితో పాటు చివరి లాంఛనాన్ని పూర్తి చేశాడు. దీంతో భారత్ విశ్వవిజేతగా అవతరించింది. సచిన్‌ను భుజాలపై గ్రౌండ్ అంతా తిప్పతూ.. టీమిండియా ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. ఆనాటి ఆ మధుర క్షణాలను మరోసారి గుర్తు చేసుకున్న సచిన్ టెండూల్కర్.. యువరాజ్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా.. ‘యువరాజ్ లేకుంటే వరల్డ్ కప్ సాధించడం సాధ్యమయ్యేది కాదు. కోట్ల మంది కలల కోసం అతను తన జీవితాన్ని సైతం త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు’ అంటూ యువీ త్యాగాన్ని మరోసారి తలచుకున్నాడు. కాగా.. నేటితో 41 ఏళ్లు పూర్తి చేసుకుని.. 42వ వసంతంలోకి వరల్డ్ కప్ హీరో యువరాజ్‌సింగ్ అడుగుపెడుతున్నాడు.